హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 26 : ఎండాకాలంలోనూ వరుణుడు వదలడం లేదు. రైతుల రెక్కల కష్టం నీటిపాలైంది. మంగళవారం రాత్రి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. వరి, మక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేలరాలాయి. కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన పంట ఉత్పత్తులూ కొట్టుకుపోయాయి. కోతకు వచ్చిన దశలో అకాల వర్షాలకు పంటలు నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వానలు ఇలాగే కొనసాగితే పెట్టుబడి కూడా వస్తుందో.. రాదో అని మదనపడుతున్నారు. కాగా, బుధవారం హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అధైర్య పడకండి.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ఎండాకాలంలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. మంగళవారం రాత్రి 8.30గంటలకు మొదలైన వర్షం తెల్లవారుజాము 3గంటల వరకూ కొనసాగింది. హనుమకొండ జిల్లాలో 25.3మి.మీ. వర్షం కురిసింది. ఇందులో అత్యధికంగా 40.4మి.మీ. ఎల్కతుర్తిలో, 40.3మి.మీ. వేలేరులో కురువగా, హసన్‌పర్తి మండలంలో 39.8మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కమలాపూర్ మండలంలో 4.4మి.మీ, పరకాల మండలంలో 8.9మి.మీ. వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల కోతకు వచ్చే దశలో ఉన్న పంటలకు తీరని నష్టం వాటిట్లింది. ఇప్పటికే 40శాతం మేరకు కోతలు పూర్తికాగా, ధాన్యం, మక్కజొన్నలు కల్లాల్లో ఆరబోసి ఉన్నాయి. అనుకోని వర్షాలతో మామిడికాయలు పెద్ద ఎత్తున నేలరాలి నాణ్యత కోల్పోతున్నాయి. కల్లాల్లో ఆరబోసిన వరి, మక్కలు తడుస్తున్నాయి. కోత దశలో ఉన్న పొలాలు, మక్కజొన్న చేన్లు నేలవాలుతున్నాయి. వర్షాలు మరో మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన రెట్టింపయింది. ఇప్పటికే జిల్లాలో వ్యవసాయశాఖ సేకరించిన ప్రాథమిక అంచనా ప్రకారం 35వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు. బుధవారం భారీ వర్షంతో నష్టపోయిన పంటలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.
రైతులు అధైర్యపడొద్దు : కలెక్టర్
కమలాపూర్ : అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. శ్రీరాములపల్లి, అంబాల, గూడూరు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న మక్కజొన్న, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న పంటల వివరాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఆమె వెంట ఏడీఏ దామోదర్‌రెడ్డి, డీసీవో నాగేశ్వర్రావు, ఎంపీడీవో పల్లవి, తహసీల్దార్ రాణి, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, ఏవో లక్ష్మారెడ్డి ఉన్నారు.
3400 ఎకరాల్లో పంట నష్టం..
భారీ వర్షాలకు సుమారు 3400 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి జాలీ లక్ష్మారెడ్డి తెలిపారు. కమలాపూర్, అంబాల, గూడూరు, శ్రీరాములపల్లి, మర్రిపెల్లిగూడెం, ఉప్పల్, భీంపల్లి, గుండేడు, కానిపర్తి, శంభునిపల్లి, నేరెళ్ల, వంగపల్లి, శనిగరం, గోపాల్పూర్ గ్రామాల్లో వరి, మక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. 940 ఎకరాల్లో మక్కజొన్న, 395 ఎకరాల్లో మామిడి తోటలు, 2,100 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు.
ఎల్కతుర్తి మండలంలో..
ఎల్కతుర్తి : అకాల వర్షాలకు మండలంలో 162 ఎకరాల్లో మామిడితోటలు, 30 ఎకరాల్లో మక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు ఏవో రాజ్‌కుమార్ తెలిపారు. ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
దామెర మండలంలో..
దామెర : మండలంలో దామెర, కోగిల్వాయి, సింగరాజుపల్లి, ఊరుగొండ, దమ్మన్నపేట, ముస్త్యాలపల్లి, తక్కళ్లపహాడ్, సింగరాజుపల్లి, ఓగులాపురం, సీతారాంపురం, పులుకూర్తి గ్రామాల్లో అకాల వర్షానికి వరి, మక్కజొన్న పంటలు పూర్తిగా నేలవాలాయి. దెబ్బతిన్న పంటలను ఇన్చార్జి ఏవో శ్రీనివాస్, ఏఈవోలు పవన్, శివలీల పరిశీలించారు.
నర్సంపేట మండలంలో..
నర్సంపేట రూరల్ : మండలంలోని మాధన్నపేట, నాగుర్లపల్లి, భాంజీపేట, పర్శనాయక్‌తండా, భోజ్యానాయక్‌తండా, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, రాంనగర్, ఇటుకాలపల్లి, ముత్తోజీపేట గ్రామాల్లో వర్షానికి వరి, మక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది.
నెక్కొండ మండలంలో..
నెక్కొండ : అకాల వర్షాలకు వ్యవసాయ మార్కెట్లోని మక్కలు తడిసిపోయాయి. కొనుగోలు చేయని మ క్కలను బయట ఆరబోస్తే వానలకు తడుస్తున్నాయం టూ రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లోని షెడ్లలో కొనుగోలు చేయని, మక్కలను సైతం ఆరబోసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
పరకాల మండలంలో..
పరకాల : మండలంలోని 11 గ్రామాల్లో 37 ఎకరాల్లో వరి, 990 ఎకరాల్లో మక్కజొన్న, 13 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. నడికూడ మండలంలో 454 ఎకరాల్లో వరి, 2,195ఎకరాల్లో మక్కజొన్న, 39 ఎకరాల్లో మామిడితోటలకు నష్టం వాటిల్లింది.
పర్వతగిరి మండలంలో..
పర్వతగిరి : మండలంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. చేతి కందే దశలో ధాన్యం నీటిపాలైందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
శాయంపేట మండలంలో..
శాయంపేట : మండలంలో 3,221 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు నివేదిక అందజేశారు. వరి 1,355 ఎకరాలు, మక్కజొన్న 1,852 ఎకరాలు, 13 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతినట్లు పేర్కొన్నారు. కొన్ని చోట్ల కంకులు చేతికి రాగా మరి కొన్ని చోట్ల కంకి వేసే దశలో మక్కజొన్న దెబ్బతిని నష్టపోయామని రైతులు చెప్పారు.