ధర్మసాగర్, మార్చి 27: దేవాదుల ప్రాజెక్ట్ మొదటి, రెండో, మూడోదశ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గుర్తు చేశారు. దేవన్నపేట పంప్ హౌస్‌లోని మోటర్లు ఆన్ చేయగా గోదావరి జలాలు చేరిన ధర్మసాగర్ రిజర్వాయర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు చూస్తున్నదన్నారు. నీటి విడుదల ఆలస్యం కావడం వల్లే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 25 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సకాలంలో మోటర్లు ఆన్ చేస్తే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. రేయింబవళ్లు కష్టపడి మోటర్లు ఆన్ చేసిన దేవాదుల ప్రాజెక్ట్ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. తన హయాంలో దేవాదుల పైపులైన్ పనులు పూర్తి కావడం పూర్వజన్మ సుకృతమని రాజయ్య పేర్కొన్నారు. మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, లాల్ మహ్మద్, బాలరాజు, గంటే సమ్మయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.