పరకాల, డిసెంబర్ 16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంతో ఉపాధిని కోల్పోయామని, తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి పాత ఏటీఎం సెంటర్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. అనాలోచిత నిర్ణయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్ట కొట్టిందని, వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ స్వయం ఉపాధి పొందుతున్న తమను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ఎవరూ ఎక్కడం లేదని, తాము రోడ్డున పడ్డామని, కుటుంబాలను పోషించుకోలేని దుస్థితి నెలకొందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కుటుంబాలను రాష్ట్ర ప్రభు త్వం ఆదుకోవాలని, లేకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు.