Colon Cancer Symptoms | ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య, ఈ సమస్యతో మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం 2020లో దాదాపు 9,30,000 మరణాలు సంభవించాయని, 1.9 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యాయని తేలింది. 2040 నాటికి ఈ గణంకాలు మరింత ఆందోళనకరంగా తయారయ్యే పరిస్థితి నెలకొంటుందని వారు చెబుతున్నారు. పెద్ద ప్రేగు క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం చాలా అవసరం. కానీ ఈ సమస్య ముందస్తు లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. సాధారణ జీర్ణ సమస్యలు అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రారంభ దశలో మనకు కనిపించే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మలబద్దకం, మలం ఆకారంలో మార్పు రావడం, నిరంతరం విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రేగులో పెరుగుతున్న కణతి కారణంగా ఈ లక్షణాలు తాత్కాలికం నుండి శాశ్వతంగా మారతాయి. అలాగే మలంలో ఎర్రని రక్తం లేదా ముదురు రంగులో మలం గమనించినట్లయితే దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మలంలో రక్తం రావడాన్ని గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటివి చేయకుండానే 10 పౌండ్లు లేదా అంతకంటే ఎక్కువ బరువు తగ్గుతారు. పోషకాహార లోపం, శరీర శక్తిని వినియోగించే కణతులు, జీర్ణక్రియలో మార్పులు వంటి కారణాల వల్ల కూడా బరువు తగ్గుతారు. పెద్ద ప్రేగు ప్రారంభ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. అలాగే తగినంత నిద్రపోయినప్పటికీ నిరంతరం అలసటగా ఉండడం కూడా ఒక సంకేతమే. అంతర్గత రక్తస్రావం వల్ల వచ్చే ఐరన్ లోపం రక్తహీనతకు దారి తీస్తుంది. దీంతో నిరంతరం అలసటగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఇక చిన్న వయసులోనే పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. కనుక లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం మంచిది. చికిత్సను ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు మరణం సంభవించే అవకాశం కూడా ఉంది. కడుపు నొప్పి, మలంలో రక్తం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుని ఇతర అనారోగ్య సమస్యగా భావించి తప్పుడు చికిత్స తీసుకుంటూ ఉంటారు. దీంతో సమస్య మరింత కష్టతరంగా మారుతుంది. అలాగే మీ వయసు 45 నుండి 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నా కూడా ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.