మరిపెడ, జనవరి 18 : సీఎం కేసీఆర్ సుభిక్షమైన పాలనలో రైతాంగంతో పాటు పేద, బడుగు బలహీన వర్గాలు, వివిధ కులవృత్తిదారులు సంతోషంగా ఉన్నారని, ఈ సారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు 25 స్థానాలు సైతం దక్కవని తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. బుధవారం మరిపెడలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వందకు పైగా సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రెండు పంటలకు పుష్కలంగా సాగునీళ్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూనే అన్నదాతకు అన్నీతానై వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో విపక్షాలకు స్థానం లేదని చెప్పారు. బీజీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వారికి కనీసం రెండు అంకెల సీట్లు కూడా రావని తెలిపారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు.