హనుమకొండ, జూన్ 14 : ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని బూత్‌లెవల్ ఏజెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక రాజకీయ పార్టీగా పోలింగ్ బూత్‌లలో మనం ఏం చేయాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ఎస్ఐఆర్ అనేది ఈ దేశంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారని, ఇప్పటివరకు రెండుసార్లు జరిగిందని, ఇప్పుడు మళ్లీ దేశ వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు జాగ్రత్తగా పనిచేస్తే మనకేం కాదన్నారు.
గ్రేటర్ వరంగల్‌లో ఈ పని ఎకువగా ఉంటుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సిద్దిపేట పట్టణం ఒకటి ఉంటుందని, గ్రామాల్లో ఎస్ఐఆర్ కింద ఫ్యామిలీ మ్యాపింగ్ 99% పూర్తయిందని సిద్దిపేట పట్టణం దగ్గరకు వచ్చేసరికి 62 శాతం దగ్గర ఆగిపోయిందన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత చురుగ్గా పాల్గొంటే రేపు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మంచి మనకు జరుగుతుందన్నారు. కార్పొరేటర్ గా పనిచేసిన వాళ్ళు, కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకునే వాళ్లు చాలా యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు.
మొదటి దశలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తున్నారని, అంగన్వాడీ, ఆర్పీలను బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యం చేశారని, బూత్ లెవెల్ ఏజెంటు, బూత్ లెవెల్ ఆఫీసర్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో 244 బూత్‌లు ఉండగా అన్నింటికీ ఏజెంట్ల పేర్లు సబ్మిట్ చేశామన్నారు. బూత్ లెవెల్ అధికారి మనతో కలిసి పని చేయకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుందని, ఫ్యామిలీ గ్రూపింగ్ మొదటిగా జరుగుతుందని, ఇందుకు 2002లో ఓటు హకు ఉన్నట్లు ఆధారం కావాలని, దానితో మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలు యాడ్ చేస్తారని తెలిపారు.

ఫ్యామిలీ గ్రూపింగ్ అయితే ఓట్లన్నీ క్లియర్‌గా ఉన్నట్లేనన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ అభిమానుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. ఎవరిదైనా ఓటు మిస్సయితే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగే అవకాశముందని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ సీరియస్‌గా పని చేయాలని, ఎప్పటికప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ రిపోర్ట్ తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగురవేయాలని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. సభ్యత్వ నమోదు మొత్తం ఆన్లైన్లో చేస్తున్నామని, పార్టీకి, కార్యకర్తలకు అవినాభావ సంబంధం ఉండేలా మెంబర్షిప్ ఉండబోతున్నదని హరీశ్‌రావు తెలిపారు.
హిట్లర్‌కి పట్టిన గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని హరీశ్‌రావు అన్నారు. అక్క డొక నియంత పేదల ఇండ్లు కూలుస్తుంటే, ఇక్క డొకరు గుడిసెలను నేలమట్టం చేస్తున్నారన్నారు. గురుకుల పాఠశాలలు, సింగరేణి, హ్యామ్ మోడ ల్ రోడ్లలో అవినీతి చోటుచేసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో అంతా స్కాం లేనని ధ్వజమెత్తారు. మంచిర్యాలకు పోయిన భట్టి విక్రమార హరీశ్‌రావు అట్లా అటుండు, ఇట్ల అటుండు అని మాట్లాడుతున్నాడని, 40 లక్షల బొగ్గు ఎకడుందో ఆయన చూపించాలని డిమాండ్ చేశారు.
సూటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానం రావడం లేదని, తాను గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. వడ్లు కొనకముందే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేపర్లో ప్రకటన ఇచ్చుకున్నాడని, కేసీఆర్ హయాంలోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామన్నారు. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనే తెలివిలేదు కానీ, బీఆర్ఎస్ను మొలకెత్తనియ్యనని రేవంత్‌రెడ్డి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది పోలీసులు అతి చేస్తున్నారని వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎకువగా కేసులు పెడుతున్నారని, చట్టం అందరకి సమానమే అన్న విషయాన్ని పోలీసు అధికారులు మరిచిపోవద్దని సూచించారు. పోలీసులకు మంచి చేసింది కేసీఆర్ అనేది గుర్తుంచుకోవాలన్నారు.
రేవంత్ వచ్చిన తర్వాత ఐదు సరెండర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు పులి రజినీకాంత్, నయీముద్దీన్, రామ్మూర్తి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టినా ఎదిరించి పోరాడుతున్నాం. అధికార పార్టీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. మాకు కేసులు కొత్తకాదు. భద్రకాళీ దేవస్థానం వద్ద నిరుపేదల ఇండ్లు కూల్చడం బాధాకరం. ప్రభుత్వ స్థలాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా అంతిమ లక్ష్యం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం ఆగదు.
-దాస్యం వినయ్ భాస్కర్, మాజీ చీఫ్ విప్