దంతాలపల్లి, మే 10 : కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు జరగడం లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. అదివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే రైతులకు సమస్యలొచ్చాయన్నారు. వరి కోతలు చేపట్టి రెండు నెలలవుతున్నా నేటికీ ధాన్యం కొనుగోలులో వేగం లేదన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ఇప్పటికైనా గన్నీ సంచులను సమకూర్చి, కాంటాలు పెట్టి, ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. వారంరోజుల్లో డోర్నకల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని కాంటా పెట్టి మిల్లులకు తరలించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సునీల్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ పీవో వెంకన్న రైతుల వద్దకొచ్చి వారంలో ధాన్యం కాంటాలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వోలాద్రి ఉమా మల్లారెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ధర్మారపు వేణు, యూత్ మండల అధ్యక్షుడు వీరబోయిన కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.