కాశీబుగ్గ/వర్ధన్నపేట/గిర్మాజీపేట/నెక్కొండ, జూన్ 1: వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వరద దత్తక్షేత్రంలో వేలాది మంది భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దత్తక్షేత్రాన్ని సందర్శించారు. కాశీబుగ్గ మార్కెట్ రోడ్డులోని కోతి విగ్రహానికి పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. కార్పొరేటర్ గుండేటి నరేందర్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్ పాల్గొన్నారు. కాశీబుగ్గలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. వర్ధన్నపేటలోని బాలాంజనేయస్వామి ఆలయం, ఇల్లంద పంచముఖాంజనేయస్వామి, రామలింగేశ్వరాలయంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశా రు. పంచముఖాంజనేయస్వామి ఆలయంలో దాతలు అన్నదానం చేశారు. వరంగల్ బట్టలబజార్‌లోని వేంకటేశ్వరాలయం, రామన్నపేటలోని రామలింగేశ్వరాలయం, స్టేషన్‌రోడ్‌లోని కాశీవిశ్వేశ్వరాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరాలయంలో ఈవో రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతుడికి సుగంధద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆకారపు వారి గుడిలో ప్రధానార్చకుడు లంకా శివకుమార్‌శర్మ పూజలు నిర్వహించారు. నెక్కొండలోని రామాలయం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాల్లో పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
న్యూశాయంపేట : హనుమాన్ జయంతి సంద ర్భంగా భక్తాంజనేయ దేవస్థానంలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాసర్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్, వేల్పుల మోహన్ రావు, వెనుకంటి సారంగపాణి జానకీరాములు, పులి రజనీకాంత్ తదితరులు హాజరయ్యారు. న్యూస్ నెట్వర్క్ : గీసుగొండ మండలంలోని కోనాయిమాకుల పంచముఖ ఆంజనేయస్వామి, ఆత్మకూరులోని వేణుగోపాలస్వామి, హనుమకొండ పద్మాక్షికాలనీలోని హనుమద్గిరి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాల్లో, కాపువాడలోని ఆంజనేయుడి విగ్రహానికి, కాజీపేట పట్టణం 62వ డివిజన్ సోమిడి భక్తాంజనేయ, రాధాకృష్ణస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.