కమలాపూర్, డిసెంబర్ 5 : ఆర్వోలు లేకుండానే పరిమితికి మించి రైతుల ధాన్యాన్ని ఎలా దించుకున్నారంటూ హనుమకొండ కలెక్టర్ పీ ప్రావీణ్య రైస్ మిల్లు యజమానిని ప్రశ్నించారు. ఇలాగైతే వారికి డబ్బులెట్లా ఇచ్చేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం సమీపంలోని వీరభద్ర రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేశారు. రైస్‌మిల్ యజమాని ఆర్వో లేకుండానే కెపాసిటీకి మించి ధాన్యం దిగుమతి చేసుకోవడంతో మండలంలో సుమారు 600 మంది రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ‘అధికారుల తప్పిదమా? రైస్‌మిల్లర్ కక్కుర్తా?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. నేరుగా రైస్ మిల్లుకు వచ్చిన ఆమె ధాన్యం నిల్వలపై ఆరా తీసి మిల్లింగ్‌ను పరిశీలించారు. కాగా, ఈ విషయమై ఇప్పటికే ఆరా తీసిన ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. అంతకుముందు కలెక్టర్ కమలాపూర్ సీహెచ్‌సీని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి అప్పయ్య, డీఆర్డీవో శ్రీనివాస్, డీసీవో కొంరయ్య, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, తహసీల్దార్ సురేశ్ కుమార్, ఎంపీడీవో బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.