వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 4 : భారతదేశంలో బంగారానికి విలువ ఎక్కువ. ఆపదకాలంలో క్షణాల్లో అమ్మి సొమ్ము చేసుకొనే వెసులుబాటు ఉండడంతో పేద, మధ్య తరగతి దీనిని రిజర్వ్ నిధిగా భావించి కొనుగోలు చేస్తారు. అంతటి నమ్మ కం, భరోసానిచ్చే పసిడి నాణ్యతను పరీక్షించేందుకు ప్రత్యేకంగా హాల్‌మార్క్ సెంటర్లు వెలిశాయి. ఇక్కడ బంగారం నా ణ్యతా ప్రమాణాలను పరీక్షించి, ముద్రలు వేస్తాయి. అయితే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పర్యవేక్షణలో నిర్వహించే హాల్‌మార్క్ సెంటర్లు పచ్చిమోసాలకు అడ్డాలుగా మారాయి. నకిలీ ముద్రలు వేసి నాణ్యతా ప్రమాణాలు లేని బంగారానికి, అసలు బంగారమే కానీ లోహాలకు 916 కేడీఎం(22 క్యారెట్) బంగారంగా నకిలీ ముద్రలు వేసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయి.
నిబంధనలు తుంగలో తొక్కి ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ సెంటర్లపై నిఘా, నియంత్రణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించిన అధికారులు అది నకిలీదిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో విఘ్నేశ్వరుడి సాక్షిగా నకిలీ హాల్‌మార్క్ ముద్రల వ్యవహారం బయటపడింది. తప్పుడు ముద్రలు వేస్తూ అటు వ్యాపారుల ను ఇటు వినియోగదారులను మోసం చేస్తూ అక్రమార్జనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్నంటడం తో కొందరు హాల్‌మార్క్ సెంటర్ నిర్వాహకుల కన్ను బ్యాంకులపై పడింది.
18 క్యారెట్, 16 క్యారెట్ నాణ్యతతో ఆభరణాలను తయారు చేయించి, 22 క్యారెట్ బంగారు ఆభరణాలుగా నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేయించి, బ్యాంకులు, వినియోగదారులను మోసం చేస్తున్నారు. తక్కువ నాణ్యతతో తయారు చేసిన ఆభరణాలను ఎక్కువ నాణ్యతతో తయారు చేయించినట్లు నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేయించి బ్యాంకు లు, ప్రైవేట్ లోన్ సంస్థల్లో పెట్టి మోసం చేస్తున్నారు. ఇటీవల ఓ బ్యాంకులో అధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో బంగారం నాణ్యతా ప్రమాణాలు పరిశీలిం చి అసలు బంగారమే కానీ ఆభరణాలకు నకిలీ హాల్‌మార్క్ ముద్రలు వేసి భారీగా లోన్ తీసుకున్నట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.
నకిలీదిగా గుర్తించిన బంగారం కొంతేనని, హాల్‌మార్క్ ముద్రలు చూసి నాణ్యత లెక్కలు వేసే రోజులు పోయాయని కొందరు బ్యాంకు ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కేసులో వరంగల్ నగరంలోని హాల్‌మార్క్ సెంటర్ నిర్వాహకుడి హస్తం ఉన్నట్లు విషయం బయటకుపొక్కడంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ హాల్‌మార్క్ ముద్రలతో హాల్‌మార్క్ సెంటర్ నిర్వాహకుడు చాలా బ్యాంకుల్లో భారీ స్థాయిలో లోన్ తీసుకున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగా రం ధర తగ్గినట్లయితే ఈ నకిలీ హాల్‌మార్క్ ముద్రల వ్యవహారం మార్కెట్‌ను కుదేలు చేసే స్థాయిలో ఉండవచ్చునని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు.