ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్‌ను రూపొందించింది. రూ.609.47 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలకవర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. సొంత ఆదాయం రూ.197.52 కోట్లు చూపగా.. గ్రాంట్ల రూపంలో రూ.408.95 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో రూ.65 కోట్లు వేతనాలు, రూ.19.75 కోట్లు గ్రీన్బడ్జెట్కు కేటాయించారు. 66 మంది కార్పొరేటర్లకు సెల్ఫోన్లు, డైరీలు, క్యాలెండర్లు, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండాప్రకాశ్ పాల్గొన్నారు.
వరంగల్, ఫిబ్రవరి 22 : ప్రజలపై ఎలాంటి పన్నుల భారం వేయకుండా 2022-23 సంవత్సర బడ్జెట్‌ను జీడబ్ల్యూఎంసీ ప్రవేశపెట్టింది. రూ.609.47 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌కు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మంగళవారం జరిగిన పాలకవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చుకుంటే 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.49 కోట్లు అదనంగా వస్తాయని అంచనా వేసింది. అదనంగా రూ.9 కోట్లు సమకూరుతాయని బడ్జెట్లో లెక్కలు చూపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు గత ఏడాది కంటే ఎక్కువగా వస్తాయని అంచనా వేసింది. జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ ప్రజలకు ఊరట కలిగించింది. పన్నుల భారం మోపకుండా సొంత ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 373.29 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనాలు వేసింది. విలీన గ్రామాల అభివృద్ధి, డివిజన్లలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించారు. సొంత ఆదాయంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలన్న నిబంధన ప్రకారం రూ.19.75 కోట్లు కేటాయించారు. అంకెల గారడీ చేయకుండా వాస్తవికతకు దగ్గరగా రూపొందించారు.
బడ్జెట్లో జీడబ్ల్యూఎంసీ సొంత ఆదాయం రూ.197.52 కోట్లుగా అధికారులు చూపారు. గత ఏడాది కంటే ఈ బడ్జెట్లో సొంత ఆదాయం రూ.14 కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు. పన్నుల ద్వారా రూ. 81.60 కోట్లు, మున్సిపల్ ఆస్తుల అద్దెల ద్వారా రూ. 13.26 కోట్లు, భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టౌన్‌ప్లానింగ్ విభాగం సేవల ద్వారా రూ. 63.12 కోట్లు, ట్రేడ్ లైసెన్స్‌లు, పారిశుధ్య విభాగం సేవల ద్వారా రూ.17.32 కోట్లు, నీటి సరఫరా కనెక్షన్లు, ఇంజినీరింగ్ విభాగం సేవల ద్వారా రూ. 22.22 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ప్రజలపై కొత్త పన్నులు వేయకుండా ఉన్న వనరులను వినియోగించుకుని సొంత ఆదాయం పెంచుకునేలా బడ్జెట్లో లెక్కలు కట్టారు.
జీడబ్ల్యూఎంసీ బడ్జెట్లో గ్రాంట్లపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 408.95 కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్లో చూపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 373.29 కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారు. నాన్‌ప్లాన్ గ్రాంట్లలో రూ.320 కోట్లు, 15వ ఫైనాన్స్, పట్టణ ప్రగతి నిధుల ద్వారా సమకూరుతాయని లెక్కలు చూపారు. ప్లాన్ గ్రాంట్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, స్వచ్ఛ భారత్ మిషన్, సీఎం హామీ, మైనార్టీ కార్పొరేషన్ నిధుల రూపేణా రూ.87 కోట్లు వస్తామని బడ్జెట్లో చూపారు. ఇతర గ్రాంట్లలో సీడీఎఫ్, ఎస్డీఎఫ్, ఎంపీ ల్యాండ్స్ రూపేణా రూ.1.95 కోట్లుగా చూపారు. డిపాజిట్, అడ్వాన్స్‌ల రూపేణా రూ.3 కోట్లు చూపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం రూ. 35.66 కోట్ల గ్రాంటు మాత్రమే వస్తుందని అంచనా వేశారు.
జీడబ్ల్యూఎంసీ సొంత ఆదాయంలో వేతనాలు, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య నిర్వహణ కోసం రూ. 106.68 కోట్లు ఖర్చు అవుతుందని బడ్జెట్లో చూపారు. ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులకు రూ.65 కోట్లు, పారిశుధ్య నిర్వహణ కోసం రూ.21.93 కోట్లు, విద్యుత్ చార్జీల చెల్లింపులు రూ. 19.35 కోట్లుగా లెక్క కట్టారు. కార్యాలయ నిర్వహణ కోసం రూ.14.54 కోట్లు అవుతుందని అంచనా వేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహణకు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగం నిర్వహణకు రూ.28.15 కోట్లు, టౌన్ ప్లానింగ్ విభాగం నిర్వహణకు రూ.2.05 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
జీడబ్ల్యూఎంసీ బడ్జెట్లో రూ. 19.75 కోట్లు గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం సొంత ఆదాయంలో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించాలన్న నిబంధన ప్రకారం ఈ కేటాయింపులు చేశారు. ఈ నిధులతో పార్కులు, నర్సరీలు అభివృద్ధి చేయనున్నారు. మిగులు బడ్జెట్లో మూడో వంతు విలీన గ్రామాల అభివృద్ధికి కేటయించాలన్న నిబంధన ప్రకారం రూ.8.80 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో విలీన గ్రామాలు, మురికివాడలు, మైనార్టీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. రూ.4.80 కోట్లు వైకుంఠధామాలు, ఖాళీ స్థలాల అభివృద్ధి, ఓపెన్ జిమ్‌లు, పబ్లిక్ టాయిలెట్లు, డంపింగ్ యార్డులు, స్ట్రీట్ వెండర్జోన్లు, జంతువధశాలలు, సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు కేటాయించారు. సొంత ఆదాయంలో ఖర్చులు పోను మిగులు బడ్జెట్లో డివిజన్లలో మౌలిక వసతుల కోసం రూ.12.80 కోట్లు కేటాయించారు. డివిజన్లలో రోడ్ల నిర్మాణాలకు రూ.4.75 కోట్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణాలకు రూ.5.30 కోట్లు, నీటి సరఫరా, మరమ్మతులకు రూ.50 లక్షలు, వీధి దీపాలు రూ.50 లక్షలు, కార్యాలయంలో ఫర్నిచర్ కోసం రూ.1.25 కోట్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయించారు.
కార్పొరేటర్లకు గ్రేటర్ పక్షాన సెల్ఫోన్లను కానుకగా అందజేశారు. బడ్జెట్ సమావేశంలో 66 మంది కార్పొరేటర్లకు సెల్ఫోన్లతో పాటు డైరీలు, క్యాలెండర్లు, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫొటోలను ముద్రించిన జ్యూట్ బ్యాగులతో కూడిన కిట్‌ను ప్రతి కార్పొరేటర్‌కు బడ్జెట్ సమావేశంలో అందించారు.
వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగానే మొదట ఇటీవల మరణించిన మాజీ కార్పొరేటర్ ఎండీ మహమూద్, మేడారం జాతరలో మరణించిన పారిశుధ్య కార్మికుడు పోలెపాక చక్రపాణికి మౌనం పాటించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన బండా ప్రకాశ్‌ను మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శాలువాలతో సన్మానించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
జీడబ్ల్యూఎంసీ 2022-23 బడ్జెట్ అభివృద్ధికి దిక్సూచిలా ఉంది. ప్రజలపై ఎలాంటి పన్నుల భారం వేయకుండా కొత్త పాలకవర్గం తొలి బడ్జెట్‌ను రూపొందించింది. అభివృద్ధిలో నగరాన్ని రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిపేందుకు శ్రమిస్తున్నాం. అందరి సహకారంతో రానున్న రోజుల్లో ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనేక ప్రధాన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ బడ్జెట్ ద్వారా నగరంలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. విలీన గ్రామాలు, మురికివాడల అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశాం. గ్రేటర్ సొంత ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తాం.
– గుండు సుధారాణి, మేయర్
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు పోవా లి. నగరాభివృద్ధి కోసం కలిసికట్లుగా పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్నిధులను సక్రమంగా వినియోగించుకోవాలి. నగరంలోని మురికివాడల అభివృద్ధిపై పాలక వర్గం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజలపై పన్నుల భారం లేకుండా బడ్జెట్‌ను రూపొందించడం అభినందనీయం.
– బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలి. హరితహారం నిర్వహణకు రూ.50 లక్షలు ఇస్తా. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మౌలిక వసతులు కల్పించడంపై శ్రద్ధ పెట్టాలి. 1962 నాటి లేఔట్ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. వాటిని పరిరక్షించి క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేయాలి. ఎల్ఆర్ఎస్ ద్వారా గ్రేటర్‌కు అధిక ఆదాయం సమకూరుతుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
-బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ
నగరాభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కృషిచేయాలి. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. పన్నుల మదింపులో గందరగోళం నెలకొంది. మురికివాడల్లోని కొన్ని గృహాలకు జరిమానా రూపంలో లక్షల రూపాయల పన్ను వస్తోంది. జరిమానా మాఫీకి కౌన్సిల్లో తీర్మానం చేసి సీడీఎంఏకు పంపించాలి. ఎస్సీ కాలనీలు, మురికివాడల అభివృద్ధికి నిధులు ఎక్కువగా కేటాయించాలి. కార్పొరేటర్లు సమష్టిగా నగర అభివృద్ధికి పాటుపడాలి.
-నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే