పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. నాలుగు నియోజకవర్గాలు కలిసి ఉన్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సొంత స్థలాలు ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. 66 డివిజన్ల నుంచి మొత్తం 13,358 అప్లికేషన్లు రాగా, 11,266 దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చినట్లు బల్దియా అధికారులు తెలిపారు. వివరాలు సరిగా లేని 2092 అప్లికేషన్లను తిరస్కరించామని, త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.
వరంగల్, సెప్టెంబర్ 10 : పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి విశేష స్పందిన వచ్చింది. సొంతంగా ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ప్రభుత్వం సహాయం అందించనున్న గృహలక్ష్మీ పథకానికి గ్రేటర్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నాలుగు నియోజకవర్గాలు కలిసి ఉన్న గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో సొంత ఖాళీ స్థలాలు ఉన్న పేదలు మొత్తం 13,358 మంది దరఖాస్తు చేసుకున్నారు. పూర్తిగా గ్రేటర్ పరిధిలో ఉన్న తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా, పశ్చిమ నియోజకవర్గం నుంచి అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి దరఖాస్తులను గ్రేటర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులను గుర్తించారు. సుమారు నెల రోజుల పాటు సాగిన క్షేత్రస్థాయి సర్వేలో సిబ్బంది 11,266 దరఖాస్తులను అప్రూవల్ చేశారు. 2092 దరఖాస్తులను విచారణలో తిరస్కరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రేటర్లో క్షేత్రస్థాయిలో దరఖాస్తుల విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే హౌసింగ్ బోర్డు అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించనున్నారు.
గ్రేటర్లో 13,358 దరఖాస్తులు
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్ల నుంచి 13,358 గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. రెండు సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజక వర్గాల పరిధిలోని డివిజన్లు కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోకి వస్తాయి. పేద,మధ్య తరగతి వర్గాలు ఉండే ఈ సర్కిల్లో అత్యధికంగా 8435 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజక వర్గాల పరిధిలోని డివిజన్లు కాజీపేట సర్కిల్ కార్యాలయం కిందికి వస్తాయి. ఈ సర్కిల్ కార్యాలయంలో 4923 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే అత్యధికంగా 5450 గృహలక్ష్మి దరఖాస్తులు వచ్చాయి.
11,266 దరఖాస్తులకు అర్హత
గ్రేటర్ పరిధిలో గృహలక్ష్మీ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో 11,266 అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 13,358 దరఖాస్తుల్లో 11,266 అప్రూవల్ కాగా, 2092 క్షేత్రస్థాయి విచారణలో తిరస్కరించారు. 66 డివిజన్లలో డిప్యూటీ కమిషనర్ల పర్యవేక్షణలో గ్రేటర్ సిబ్బంది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను అప్రూవల్ చేశారు. అర్హత ఉన్న దరఖాస్తుల వివరాలను హౌసింగ్ బోర్డు వారి ఆన్లైన్లో నమోదు చేశారు. అర్హత సాధించిన ఈ దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను హౌసింగ్ బోర్డు అధికారులు చేపట్టనున్నారు.