వరంగల్, జూన్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల లొల్లి ముదురుతున్నది. కీలకమైన పదవుల్లో ఉన్నవారే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీ పరువును బజారు కీడుస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు చేసిన కొండా మురళీధర్‌రావును పీసీసీ వివరణ కోరగా, శనివారం ఆయన తన అనుచరులతో గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌లో బీసీ నేతలను టార్గెట్‌గా చేస్తూ మంత్రి పొంగులేటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారని, తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల పంచాయతీ కొత్త మలుపు తిరిగింది. ఇటీవలి వరుస పరిణామాలతో ప్రభుత్వంలో, పార్టీలో వివాదాస్పద నేతగా మారిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కారణంగానే గ్రూపుల రచ్చ పెరుగుతున్నదనే చర్చ మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, సీతక్క టార్గెట్‌గా మంత్రి పొంగులేటి రాజకీయం చేస్తున్నారని కొండా దంపతులు ఎదురుదాడి మొదలు పెట్టారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు గాంధీభవన్ వేదికగా శనివారం మంత్రి పొంగులేటిపై విమర్శలు చేశారు. బీసీలకు వ్యతిరేకంగా రెడ్డి నాయకులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు వెళ్లి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు.
మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు చేసిన కొండా మురళీధర్‌రావును పీసీసీ వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కొండా మురళీధర్‌రావు వర్గం గాంధీభవన్‌కు వెళ్లింది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కొండా మురళీధర్‌రావు లిఖితవూర్వకంగా వివరణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లక్ష్యంగా లేఖలో పలు విషయాలను వివరించారు. కాంగ్రెస్‌లో బీసీ నేతలను టార్గెట్‌గా చేస్తూ పొంగులేటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కొండా మురళి వ్యాఖ్యలతో వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూపుల లొల్లి మరింత ముదిరినట్లయ్యింది.
తాజా పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త, పాత వర్గాలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయిన పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి.., ఆయనతోపాటు కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు మొ దలయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మం త్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అందరినీ సమన్వ యం చేయకుండా గ్రూపులను పెంచుతున్నారని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, రాంచంద్రూనాయక్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమకు వ్యతిరేకంగా ఉండేలా చేస్తున్నారని కొండా సురేఖ వర్గం భావిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరి గెలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు… బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి ఇదే గ్రూపులో చేరి తమపై కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రికి తమకు వ్యతిరేకంగా పదేపదే ఫిర్యాదులు చేస్తున్నారని మంత్రి కొంరడా సురేఖ ఇటీవల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు ఫిర్యాదు చేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే కారణమని కొండా మురళి అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మంత్రి కొండా సురేఖ, ఇన్చార్జి మంత్రి పొంగులేటిపై విమర్శలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొన్నది. కీలకమైన పదవుల్లో ఉన్న వారే ఇలా చేస్తే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతున్నది.
వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమపై కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలను టార్గెట్‌గా చేస్తూ అగ్రవర్ణాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేస్తున్నారని, తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య విబేధాలు ఉన్నాయని కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న ఇందిరకు కడియం శ్రీహరి చుకలు చూపిస్తున్నాడని, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇందిర అనుచరులను టార్చర్ చేస్తున్నాడని అన్నారు.
పరకాల నియోజకవర్గం పూర్తిగా తమదేనని, తమ మద్దతుతోనే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడని చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నారని, తనకు సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలోని వారికి పార్టీలో పోస్టులు ఇప్పిస్తున్నారని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో వేం నరేందర్‌రెడ్డి సీటు ఎగిరిపోవడానికి తామే కారణమనే కోపంతో తనకు వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, కొంతమంది తరహాలో పార్టీ మారినా పదవులను పట్టుకొని లేనని పరోక్షంగా కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్యను విమర్శించారు.