దేవరుప్పుల, మార్చి 14: కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరి ఎమ్మెల్యే ఎదుట బలప్రదర్శనకు వేదికగా మారిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలోని వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతరలో వెలుగు చూసింది. కడవెండిలో వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి జాతరలో శుక్రవారం స్వామివారి శోభాయాత్ర ప్రారంభం కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి హాజరు కాగా, వారి సమక్షంలోనే కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల లొల్లి కనిపించింది.
కాంగ్రెస్ పార్టీ దేవరుప్పుల మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి వర్గం-ఝాన్సీరెడ్డి మధ్య వివాదం నెలకొని కృష్ణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వానకొండయ్య లక్ష్మీ నర్సింహస్వామి జాతరకు నువ్విక్కడికి ఎందుకు వచ్చావని పెద్ది కృష్ణమూర్తిని ఓ లీడర్ ప్రశ్నించగా, అతని మీదకి పెద్ది వర్గం దూసుకువెళ్లింది. ఇరువర్గాల మధ్య గొడవను చూసిన పాలకుర్తి సీఐ మహేందర్‌రెడ్డి, స్థానిక ఎస్సై సృజన్‌కుమార్ వెంటనే కృష్ణమూర్తిని వారించి, ఇక్కడ ఉండొద్దని, జాతరలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని సర్ది చెప్పారు.
తాను గ్రామస్తుల పిలుపుతోనే జాతరలో పాల్గొనడానికి వచ్చానని, శోభాయాత్రతో పాల్గొంటానని తెలుపగా, రెండు గ్రూపుల మధ్య గొడవకు తావివ్వొద్దని పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పోలీసుల రక్షణ మధ్య స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్ర్తాలను తీసుకు వెళ్లారు. కడవెండిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు ఈ జాతరతో బట్టబయలయ్యాయని ప్రజలు చర్చించుకున్నారు.