నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం గ్రూప్-3 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 జరుగగా, అభ్యర్థుల హాజరు 55 శాతానికి మించలేదు. అక్కడక్కడా పరీక్ష సమయానికంటే ఆలస్యంగా పలువురు అభ్యర్థులు రావడంతో వారిని అధికారులు లోనికి అనుమతించకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉండి ఇళ్లకు వెళ్లిపోయారు. ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొత్తం 174 సెంటర్లు ఏర్పాటు చేయగా, 62,695 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉంది.
కాగా ఉదయం 33,784, మధ్యాహ్నం 33,608 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 176 మంది మధ్యాహ్న పరీక్ష రాయలేదు. పరీక్షార్థులకు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపగా, పోలీసులు సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పరిశీలించారు. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పరీక్ష రాయాల్సిన మహిళా అభ్యర్థి జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. విషయం తెలుసుకొని మోడల్ స్కూల్కు వెళ్లే సరికి సమయం మించిపోవడంతో లోనికి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.