హనుమకొండ/ఖిలావరంగల్/భూపాలపల్లి రూరల్/ములుగు, మహబూబాబాద్ రూరల్/జనగామ చౌరస్తా, డిసెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. లేటుగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. వరంగల్ జిల్లాలో 11,310 మంది అభ్యర్థులకు 5,275 మంది, హనుమకొండ జిల్లాలో 33006 మందికి 16,312 మంది, భూపాలపల్లి జిల్లాలో 4,423 మంది అభ్యర్థులకు ఉదయం 2,152 మంది, మధ్యాహ్నం 2,181 మంది హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో 7,470 మంది అభ్యర్థులకు ఉదయం 3,886 మంది, మధ్యా హ్నం 3,868 మంది, ములుగు జిల్లాలో 2,195 మంది అభ్యర్థుల కు ఉదయం 1,104, మధ్యా హ్నం 1,113 మంది, జనగామ జిల్లాలో 5,470 అభ్యర్థులకు ఉదయం 2,9 59, మధ్యాహ్నం 2,947 మంది పరీక్ష రాశారు. హనుమకొండ, వరంగల్‌లో కలెక్టర్ సత్యశారద, ము లు గు అదనపు కలెక్టర్ సంపత్‌రావు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
ములుగు, డిసెంబర్15(నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలో గ్రూప్-2 అభ్యర్థులకు రవాణా సౌకర్యం లేక పరీక్ష మిస్సయ్యారు. జిల్లా కేంద్రంలోని సాధన, బ్రిలియంట్, లిటిల్‌ప్లవర్ స్కూల్, బండారుపల్లి మోడల్ పాఠశాలలోని సెంటర్లకు అభ్యర్థులు చేరుకునేందుకు రవాణా పరంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా మరి కొందరు వాహనదారులను లిఫ్ట్ అడిగి సెంటర్లకు చేరుకున్నారు. సాధన స్కూల్ సెంటర్లో భవాని, బండారుపల్లి మోడల్ స్కూల్ సెంటర్లో జీపీ కార్యదర్శి క్రాంతితో పాటు తాడ్వాయి గ్రామానికి చెందిన దయాకర్, సారంగపల్లి గ్రామానికి చెందిన ఆమని లేట్‌గా రావడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. సెంటర్ల వద్దకు అధికారులు రవాణాపరమైన సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో పాటు హెల్ప్ డెస్క్ సెంటర్లను నిర్వహించకపోవడంతో అభ్యర్థులు ఆయోమయానికి గురయ్యారు.