కండ్ల ముందే పచ్చటి పొలాలు ఎండుతుంటే రైతుల గుండె మండిపోతున్నది. పంటలు కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడినప్పటికీ ఫలితం లేదు. దీంతో చేసేదేమీలేక పశువులను మేపుతున్నారు. జనగామ జిల్లాలో సకాలంలో దేవాదుల నీళ్లు రాక కష్టాలు చుట్టుముట్టాయి. గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో బోర్లు, బావులు వట్టిపోయాయి. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అన్న దాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఐదారు రోజుల్లో నీటిని వదలకుంటే మిగి లిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
– జనగామ, మార్చి 27(నమస్తే తెలంగాణ)
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దంపతుల పేర్లు లొడంగి కొమురయ్య-రేణుక. జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామం. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి యాసంగిలో వదిలినట్లే ఈసారి దేవాదుల నీటిపై ఆశలు పెట్టుకొని తనకున్న మూడున్నర ఎకరాల్లో రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టి నాటు వేసిన్రు. వీళ్ల పొలానికి రెండు బోర్ల ద్వారా నీటి వసతి ఉన్నది. గత పదేండ్లు చుట్టుపక్కల చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండి అలుగుపోసేవి. దీంతో భూగర్భ జలాలు పెరిగి రెండు బోర్లు రాత్రి, పగలు నిండుగా పోసేవి. మొన్న నాట్లు వేసే సమయంలో కూడా ఈ రెండు బోర్లలో నీళ్లు బాగానే వచ్చాయి. దేవాదుల నీళ్లు వదలకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. ఇంకో తడి పారితే పంట చేతికొస్తుందనగా రెండు బోర్లు ఎండిపోయాయి. ఈనిన వరికి మరో తడి నీరు అందే పరిస్థితి లేక కండ్ల ముందే పచ్చటి పంట ఎండిపోయింది. మొన్నటిదాకా పచ్చగా కళకళలాడి చేతికొస్తున్న పంట కండ్ల ముందే ఎండిపోవడంతో చేసేదేమీ లేక దుఖాన్ని దిగమింగుకున్న రైతు దంపతులు పాడి గేదెను మేపుతున్నారు. మిగిలిన పొలాన్ని పశువులు, గొర్రెలకు మేతగా వాడుతున్నారు.
గతంలో మాదిరిగానే దేవాదుల నీటిని విడుదల చేసి నీటి వనరులన్నీ నింపితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరుంటుందని ఆశపడి యాసంగి పంటలు వేసిన జనగామ జిల్లా రైతుకు మునుపటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. చెరువులు, కుంటలు, బోర్లు, బావులపై ఆధారపడి పంటలు సాగు చేయగా.. భూగర్భ జలాలు అడుగంటి నీళ్లు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర కారణంగా జనగామ జిల్లా లోని పలు మండలాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. బోరుబావులు క్రమంగా వట్టిపోతున్నాయి.
సరిపడా నీరందక చేతికొచ్చే దశలో ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయి పొలాలు పశువులకు మేతగా మారాయి. చేతికికొచ్చిన పంటలు మరో రెండు తడుల వద్ద ఎండిపోతున్నాయి. ఎకరాకు రూ.80 వేల వరకు పెట్టుబడి పెడితే చివరికి పశువులు, జీవాల మేతకు పెట్టాల్సి వస్తున్నది. చేసిన కష్టం పోగా పెట్టుబడులు రైతులకు అప్పులను మిగులుస్తున్నాయి. పదేండ్లు సాగు నీరు, కరెంటు కష్టాలు చూడని రైతులు ఇప్పుడు కరువును చూస్తున్నామని అంటున్నారు. నీళ్లొదలాలని రెండు నెలలుగా నెత్తీనోరు బాదుకున్నా పట్టించుకునే వారు లేకపోడంతో చేతికొచ్చిన పంటను గాలికి వదలాల్సి వచ్చిందని అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. ఇప్పుడు గోదావరి జలాలు అందకుంటే మిగిలిన పంట కూడా పూర్తిగా ఎండిపోయి తాగునీటికీ తిప్పలు వచ్చే అవకాశముంది.
పంట నష్టపరిహారం చెల్లించాలి..
మునుపటి లెక్క నీళ్లిస్తరని ఆశతో వరి పంట ఏసినం. రెండున్నర ఎకరాలు నాటుపెడితె నిట్టనిలువున ఎండింది. కత్తులోరి కుంటల నీళ్లుంటె బోర్లు పోసేది. కుంట ఎండింది బోర్లు పోయినయ్. నీళ్లొస్తయని కండ్లు కాయలు కాసేలా చూసినం.. రాలే. పక్క మండలం గుండాలకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నా భూమిల నుంచి కాల్వ తీసి జబర్దస్తిగ దేవాదుల నీళ్లు తీసుకుపోయిండు. మా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నీళ్లు తెస్తదని నమ్మకముండె.. దాన్ని వమ్ము చేసింది. బర్రె దూడెలు, ఎడ్లను మేపుతున్న. నాకైన అప్పు పదేండ్లయినా తీరదు. మా ఎమ్మెల్యే మా కోసం కొట్లాడి పంట నష్టపరిహారం ఇప్పించాలె.
– మేడ రాజు, రైతు, సింగరాజుపల్లి, దేవరుప్పుల
ఎండిన 10 ఎకరాల పంటను గొర్లకు కొన్న..
మా ఊళ్లె రైతుల వరి చేన్లు ఎండిపోతె ఎకరానికి రూ.5 వేలకు కొన్న. పదెకరాలు కొని గొర్లు మేపుతున్న. ఎండాకాలం మేతలేక ఆగంకాకుండా ఇవి ఆసరవుతున్నయ్. ఎండలు దంచి కొడుతున్నయ్. పచ్చగడ్డి లేదు. తుమ్మలు లేవు. ఎండిన వరి చేన్లే గొర్లకు మేతయితాంది. రైతుకు ఈ డబ్బులు కొంతైనా ఆసరైతవి. కరువు కాలం కొడుతుంది. జీవాలకు నీళ్లు దొరుకుడు కష్టమే ఉంది. ప్రభుత్వం నీళ్లొదిలి చెర్లు, కుంటలు నింపాలె. లేకపోతె వరి ఎండినట్టే పసులు నీళ్లులేక సస్తయ్.
– మరాఠి సాయిలు, గొర్రెల యజమాని, కామారెడ్డిగూడెం, దేవరుప్పుల