వరంగల్, అక్టోబర్ 14 : ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు, అధికార యంత్రాంగం మరిచిపోయింది. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం రెండేళ్లుగా మూతపడి ఉంది. రూ. కోటి నిధులతో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని 15 ఏప్రిల్ 2022న అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
రెండేళ్లుగా దాని నిర్వహణ బాధ్యత ఎవరిదనే సందిగ్ధం నెలకొంది. పోతన విజ్ఞాన పీఠం ఆవరణలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ నిర్మాణం పూర్తి చేసి వదిలేసింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టాలని నిర్ణయించినా ఇప్పటి వరకు బాధ్యత తీసుకోలేదు. ప్రస్తుతం పోతన విజ్ఞాన పీఠం ఆధీనంలో మ్యూజి యం ఉండగా, నిర్వహణ బాధ్యతలు ఎవరు చేయాలనే దానిపై సందిగ్ధంతో మ్యూజియం నిరుపయోగంగా మారింది.
బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియానికి ప్రచారం కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఇప్పటి వరకు పెద్దగా సందర్శకులు, విద్యార్థులు వచ్చిన దాఖలాలు లేవు. మ్యూజియం ఉందన్న విషయం చాలా వరకు తెలియదంటే అతియోశక్తి కాదు. దాని నిర్వ హణ బాధ్యతలను పర్యాటక శాఖకు అప్పగించి విస్తృత ప్రచారం కల్పిస్తే మ్యూజియానికి సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
భాగవతంలోని ఏ అధ్యాయం చదవాలన్నా మ్యూజియంలో సుమారు 15 డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, సందర్శకులకు భాగవతం వివరించేందుకు హాల్, సీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద స్క్రీన్‌పై ‘పలికెడిది భాగవతమట.. పలికించేవాడు రామచంద్రుడట’ పద్యంతోపాటు బమ్మెర పోతన, శ్రీరాముడి ఫొటో ఉన్న పెద్ద స్క్రీన్ కనిపిస్తుం ది. పూర్తి ఏసీతో ఏర్పాటు చేసిన పోతన మ్యూజియం అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో మూతపడి ఉంది.
మ్యూజియం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అధికారులు నిర్వహణ కోసం సిబ్బందిని నియమించడం మరిచారు. అప్పుడప్పుడు పోతన విజ్ఞాన పీఠం సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. మ్యూజియానికి వచ్చే సందర్శకులకు పోతన భాగవతాన్ని వివరించేందుకు గైడ్‌తోపాటు నిర్వహణకు కేర్ టేకర్, అటెండర్లను నియమించి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. బమ్మెర పోతన రచించిన భాగవతం సారాంశాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.