శాయంపేట, మే 20 : మండలంలోని ఆరెపల్లి-ఆత్మకూరు దారిలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా హరితహారంలో పెంచిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యవసాయ వ్యర్థాలను రోడ్ల పకన పోసి ఉంచడంతో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో హరితహారం చెట్లు మంటల్లో కాలిపోయాయి. ప్రయాణికులకు నీడ కల్పించేందుకు రోడ్ల పకన కొన్నేళ్లుగా చెట్లను పెంచుతున్నారు. అయితే వీటిని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రోడ్ల పకన మంటలు అంటుకొని చెట్లు ఆహుతవుతున్నాయి. గతంలో కూడా మైలారం పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన చెట్లు కాలిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.