ములుగు, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ములుగు మున్సిపాలిటీకి మా ర్గం సుగమమైంది. శనివా రం రాష్ట్ర మంత్రివర్గ స మావేశంలో ఈమేరకు సా నుకూల నిర్ణయం తీసుకోవడంతో మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీ బిల్లును త్వరలోనే గవర్నర్ వద్దకు ఆమోదం కోసం పంపాలని తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో చాలాకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ములుగు జీపీతో పాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి, జాకారం గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నారు.
గత కేసీఆర్ సర్కారు హయాంలోనే ములుగు మున్సిపాలిటీకి తొలి అడుగు పడింది. 2022 సెప్టెంబర్ 12న మున్సిపాలిటీగా మార్చుతూ గెజిట్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడపడంతో కాంగ్రెస్ సర్కారుపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ఎట్టకేలకు స్థానిక మంత్రి సీతక్క చొరవ తీసుకొని శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మున్సిపాలిటీ బిల్లును గవర్నర్ వద్దకు పంపేలా కృషి చేశారు.
2024 ఫిబ్రవరిలో సర్పంచ్ పదవీ కాలం పూర్తయిన వెంటనే ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతూ మున్సిపాలిటీ ఏర్పాటును ఆలస్యం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ములుగు, జీవంతరావుపల్లి, బండారుపల్లి గ్రామాలను కలుపుకొని 20వార్డులతో మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం జాకారం గ్రామ పంచాయతీని సైతం మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వార్డుల సంఖ్య పెరగనున్నది. మున్సిపాలిటీ కోసం గత ప్రభుత్వం రూపొందించిన పాత బిల్లును రికాల్ చేస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అధికార ప్రక్రియ పూర్తి కాగానే ములుగు మున్సిపాలిటీగా అవతరించనున్నది.