వరంగల్, జూన్ 6 : నగర ప్రజలకు పౌర సేవలు అందించాల్సిన కార్యాలయంలో కొందరు సిగ్గూఎగ్గూ లేకుండా శృంగార కార్యకలాపాలు సాగిస్తూన్నారు. పని ప్రదేశంలోనే బరితెగించి ఇకఇకలు, పకపకలతో పాటు ముద్దులు పెట్టుకుంటూ రాసలీలల్లో మునిగితేలుతూ కామకేళి సాగిస్తూ గ్రేటర్ వరంగల్ పరువును బజారుకీడుస్తున్నారు. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ రాసలీలల ఘటన కొద్దిరోజుల క్రితం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
వివరాలిలా ఉ న్నాయి. నాలుగు రోజులక్రితం జూనియర్ అకౌంట్ ఆఫీసర్లుగా ఉద్యోగంలో కొత్తగా చేరిన ఇద్దరు ఏకంగా సెక్షన్లోనే రాసలీలకు తెరలేపారు. భోజన విరామ సమయంలో కౌగిలింతలు, ముద్దులు పెట్టుకుంటుండగా కొందరు వీడియో లు తీయడంతో విషయం బయటికి పొక్కింది. సదరు ఉద్యోగులను సెక్షన్ సూపరింటెండెంట్ మందలించినట్లు సమాచారం. అయినా, మార్పు రాలేదని సహచరులు గుసగుసలాడుతున్నారు. కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఘటనపై విచారణకు అదనపు కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిసింది.
మినీ సచివాలయంగా పిలిచే బల్దియా ప్రధాన కార్యాలయం పరువు బజారున పడిందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పదవుల్లో మహిళలు ఉన్న కాలంలోనే ఇలాంటి జుగుప్సాకరమైన ఘటనలు జరగడం గమనార్హం. బల్దియా ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టాలని, ప్రతి సెక్షన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే డిమాం డ్లు వస్తున్నాయి.
ఉద్యోగులపై పర్యవేక్షణ లేకపోవడంతో బల్దియా కార్యాలయ పాలన గాలికి వదిలివేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాలో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.