నమస్తే నెటవర్క్, అక్టోబర్ 13: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్సాహంగా దసరా పండుగను జరుపుకున్నారు. పాలపిట్టను దర్శించుకొని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి జమ్మి ఆకును కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు ఇచ్చి అలయ్ బలయ్ తీసుకున్నారు. ఆయా చోట్ల పేల్చిన బాణసంచాలతో ఆకాశంలో తారాజువ్వలతో హరివిల్లు విరిసింది. రావణాసురుల ప్రతిమలకు నిప్పంటించి దహ నం చేశారు.
పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బొడ్రాయి వద్ద, జమ్మి పూజలో పాల్గొని జమ్మి పూజలు నిర్వహించారు. జనగామలోని బతుకమ్మకుంట వద్ద నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండలోని సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నగర ప్రజలు రావణవధ తిలకించడానికి వచ్చారు. వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేసిన దసరా వేడుకలు అంబరాన్నంటాయి. మైదానం ప్రజలతో కిక్కిరిసిపోయింది.
ఆటా-పాటా, బాణసంచాల మోతతో ఉర్సు గుట్ట దద్దరిల్లింది. గ్రేటర్ వరంగల్ నగరంలోని 20వ డివిజన్ పద్మనగర్ చిన్నవడ్డేపల్లి చెరువు సమీపంలో రావణవధ నిర్వహించగా, ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఆయా చోట్ల మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీలు, బస్వరాజు సారయ్య, డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, సీపీ అంబర్ కిశోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.