తొర్రూరు/పెద్దవంగర, మే 6: కొనుగోలు కేంద్రాల్లో రోజు ల తరబడి కాంటాలు కాక ఇబ్బందులు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చిపడింది. రవాణా వాహనాల కొరతతో కాంటాలైన బస్తాలను మిల్లులకు తరలించకపోవడంతో అవి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. దీంతో కొత్తగా క్రయ విక్రయాలు చేపట్టకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పెరుగుతుండడంతో వర్షం భయంతో రైతు లు ప్రైవేట్ వ్యాపారులకు అగ్గువకు అమ్ముకుంటున్నారు. తొర్రూరు మండలం మాటేడులోని కొనుగోలు కేంద్రంలో రైతు లు మంగళవారం ఆందోళన చేపట్టారు. రవాణా వాహనాలు లేకపోవడంతో ప్రైవే ట్ ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తరలించుకోవాలని అధికారులు చెప్పడంపై మండిపడ్డారు. అలాగే పెద్దవంగర మండ ల కేంద్రంలోని సెంటర్లో నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వడ్ల బస్తాకు నిప్పంటించి రైతులు నిరసన తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కాంటాలు పెట్టి ధాన్యా న్ని మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. కాగా, రవాణా వాహనాల కొరతను ఎదుర్కొంటున్న అధికారులు మంగళవారం రోడ్డెక్కారు. తొర్రూరులోని పాల కేంద్రం వద్ద తహసీల్దార్లు శ్రీనివాస్, మహేందర్, ఎస్సై రాంజీనాయక్, ఇతర సిబ్బంది మాటువేసి ఖాళీగా వెళ్లే లారీలను నిలిపి, కిరాయిలు మాట్లాడి కొనుగోలు కేంద్రాలకు తరలించారు.
మళ్లీ వానొస్తే వడ్లు తడుస్తయ్..
కొనుగోలు కేంద్రంలో అమ్మేందుకు 340 బస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చిన. బస్తాలు కాంటాలై చాలా రోజులవుతున్నది. ఇప్పటికీ మిల్లులకు తరలించలేదు. ఓ వైపు చీకటి పడిందంటే ఎప్పుడు వానొస్తదోనని ఆందోళన చెందుతున్నం. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వెంటనే స్పందించి మిల్లులకు తరలించేందుకు లారీలు పంపించాలి.
– జాటోత్ సత్తు, గిరిజన రైతు, రామచంద్రతండా