మహబూబాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవిక్రయాలు ఊ పందుకోవడం లేదు. కేవలం రెండు కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుగుతుండగా, మిగిలిన 70 సెంటర్లలో ఒక్క గింజ కూడా సేకరించలే దు. ఇప్పటి వరకు 21 టన్నుల ధాన్యం మా త్రమే కొనుగోలు చేశారు.
ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో అధిక వర్షాలు కురవడంతో ఒకవైపు కల్లాల్లో ధాన్యం తడవగా.. మరోవైపు కోతకొచ్చిన పంట నేలవాలిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను తేమ (మాయిశ్చర్) సాకు చూపుతూ నిర్వాహకులు కొ నుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నారు. తేమ 17 శాతం ఉంటేనే కొంటామని, లేదం టే కొనుగోలు చేయమని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
దీంతో రైతులు ధాన్యాన్ని అక్కడే ఉదయం ఆరబోస్తూ, సాయంత్రం కుప్పచేసి పరదాలు కప్పుతూ తెల్లవార్లూ జాగారం చే యడం పరిపాటిగా మారింది. గత 15 రోజు ల నుంచి ఇదే తంతు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సివిల్ సప్లయ్, సహకార శాఖల అధికారులు తమ ఇబ్బందులపై దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌తో పాటు అధికారులు స్పందించాలని, తమ బాధలు పట్టించుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.