ములుగు, మే 30 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 28న ఉత్తర్వులు జారీచేశారు. 29వ తేదీ నుంచి ములుగు, జీవంతరావుపల్లి, బండారుపల్లి గ్రామాలను విలీనం చేస్తూ 20 వార్డులను ఏర్పాటు చేశారు. కమిషనర్‌గా గ్రేడ్-3 అధికారి జే సంపత్‌ను నియమించగా ఆయన శుక్రవారం విధుల్లో చేరారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో టాక్సేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వై రామకృష్ణను ములుగు మున్సిపల్ టాక్సేషన్ ఆఫీసర్‌గా నియమించారు.
కాగా, మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ములుగును గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏకైక జీపీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మార్చేందుకు గత సర్కారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిన్నర తర్వాత ములుగును మున్సిపాలిటీగా ప్రకటిస్తూ జీవో విడుదల కావడంతో గ్రామ పంచాయతీ పాలనకు తెరపడనుంది.
ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో మొత్తం 16,533 మంది జనాభా ఉన్నారు. ములుగు జీపీ పరిధిలో పాల్‌సాబ్‌పల్లి, రంగారావుపల్లి, ప్రేమ్‌నగర్, మాధవరావుపల్లి, జీవంతరావుపల్లిలో గణేశ్లాల్పల్లి శివారు గ్రామాలుగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగులో 16 వార్డులు, 4 శివారు పల్లెలతో కలుపుకొని 12,135 జనాభా ఉండగా, 9,422 మంది ఓటర్లున్నారు. అలాగే బండారుపల్లిలోని 12 వార్డుల్లో 3,187 జనాభా, 2,436 ఓటర్లు, జీవంతరావుపల్లిలోని 8 వార్డుల్లో 1,211 జనాభా, 628 మంది ఓటర్లున్నారు.