ఏటూరునాగారం, జూన్ 25 : మండలకేంద్రలోని నార్త్ మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుల నైపుణ్యత, బోధనతీరుపై తోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ముగ్దులవుతున్నారు. వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా ఈ పాఠశాలకే పంపిస్తున్నారు. ఎనిమిది మంది ఉపాధ్యాయుల పిల్లలు 16 ఇక్కడే అడ్మిషన్ పొందారు. ఈ స్కూల్ పూర్తి ఇంగ్లిష్ మీడియం కావడంతో ఈ ప్రాంతంలోని పిల్లలు సైతం ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పాఠశాల హెచ్ఎం రాజశేఖర్ తన కుమార్తెను, ఉపాధ్యాయుడు రాంబాబు సైతం తన ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో జాయిన్ చేశారు. మండలంలో ఇతర పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ నివాసాలకు దగ్గరగా పాఠశాలలు ఉన్నప్పటికీ వాటిల్లో కాకుండా నార్త్ మండల పరిషత్ పాఠశాలలో చేర్పించడం గమనార్హం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ బోధిస్తున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఇక తమ పిల్లలను పాఠశాలకు పంపించడమే కాకుండా అభివృద్ధికి కూడా సహకరిస్తామని హామీ ఇస్తున్నారని రాజశేఖర్ తెలిపారు.