‘రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగ ఉన్నరు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసమని సుద్దులు చెప్పే బీజేపీ నేతల అసలు స్వరూపం బండి మాటలతో బయటపడిందన్నారు. కవితపై ఈడీ విచారణ అనేది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. మహిళ అన్న గౌరవం లేకుండా బండి చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనకు ఆడబిడ్డలపై ఉన్న అభిప్రాయమేంటో తేటతెల్లమైందన్నారు. సంజయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనేది లేదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించగా, బండి ఓ పిచ్చోడు అని ఎమ్మెల్యే నరేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వారు హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హనుమకొండ, మార్చి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని రమేశ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశం కోసం ధర్మం కోసం అని సుద్దులు చెప్పే బీజేపీ నాయకుల అసలు రూపం బండి సంజయ్ మాటలతో బయటపడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాల నా విధానాన్ని దేశంలోని ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే ఐటీ, ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ముందుగా నోటీసులు జారీ చేసి లొంగితే విత్ డ్రా చేసుకుంటారు(ఉదాహరణగా సుజనాచౌదరి, సీఎం రమేశ్ పేరును ప్రస్తావించారు), లేకుంటే దాడులు చేయించడం, వేధింపులకు పాల్పడడం బీజేపీకి అనవాయితీగా మారిందని ఎర్రబెల్లి మండిపడ్డారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు గంగుల కమాలకర్, శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయని, రేపో మాపో మాపై కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదని, అయినా మేము సిద్ధంగా ఉన్నామని ఎర్రబెల్లి తెలిపారు. ఇవి మాకు కొత్తకావు.. మేము ఎక్కడి వరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ, ఈడీ సంస్థలు బీజేపీకి కీలుబొమ్మల్లా మారాయని, మోదీ ఏది చెబితే అది చేస్తాయన్నారు. ఉద్యమ నాయకురాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, బతకమ్మ పండగ విశిష్టతను ప్రపంచానికి చాటిన ఎమ్మెల్సీ కవిత మహిళ అని చూడకుండా ఈడీ నోటీసులను జారీ చేసిందన్నారు. ఈ నోటీసులు ఈడీవి కావని, మోదీ నోటీసులన్నారు. ఓ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలు మహిళలపట్ల బీజేపీకి ఉన్న వైఖరిని తేటతెల్లం చేస్తుందన్నారు. అమిత్‌షా చెప్పులు మోసిన వ్యక్తి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బాధ్యత కల్గిన ఎంపీ హోదాలో ఉండి ఒక ఉద్యమకారిని, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కుటుంబం మీద బీజేపీకి ఉన్న విద్వేషాన్ని తెలియజేస్తుందని మండిపడ్డారు. దేశంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను సీఎం కేసీఆర్ యావత్ భారత దేశం ముందు ఎత్తి చూపుతున్నందుకే కేసీఆర్ కుటుంబంపై దాడులు చేయిస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎమ్మెల్సీ కవిత మంచి నిర్ణయం తీసుకొన్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీజేపీ నాయకుల అసత్య, విద్వేష విషపూరిత రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేస్తున్నాయన్నారు. వీరి తీరు ప్రజా స్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటుగా మారిందన్నారు. తెలంగాణాలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా నేనున్నా అన్న రాష్ట్ర గవర్నర్.. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. దీనిపై వెంటనే గవర్నర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీకి మహిళలపై గౌరవం లేదనేందుకు నిదర్శనం తల్లి చనిపోయిన రోజు భార్యను, పిల్లలను తీసుకెళ్లకపోవడమేనన్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో కాంట్రాక్టర్ల వద్ద నుంచి బీజేపీ మంత్రులు,ఎమ్మెల్యేలు కమీషన్ల వాటా ఇవ్వాలని వేధిస్తుంటే … అటు వైపు ఈడీ, సీబీఐ ఎందుకు కన్నెత్తి చూడడం లేదని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. ‘తెలంగాణ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదు, మీరు పెట్టే అక్రమ కేసులకు, దర్యాప్తులకు భయపడి మీకు సరెండరయ్యే సమస్య లేదు.. ఎంతటి వరకైనా పోరాడుతాం.. పోరాటంలో విజయవం సాధిస్తామని’ ఆయన స్పష్టం చేశారు. బీజేపీని, బండి సంజయ్‌ను తెలంగాణ ప్రజలు వదిపెట్టరని, మీకు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పే వరకూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిరసనలు కొనసాగిస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఈడీ విచారణ కక్ష సాధింపు చర్య : దాస్యం
ఉద్యమ నాయకురాలు, భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళ అనే గౌరం లేకుండా ఒక గూండాగా, రౌడీగా బండి సంజయ్ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంజయ్ చేసిన వాఖ్యలు బీజేపీకి మహిళలపై ఉన్న అభిప్రాయం ఏమిటనేది వ్యక్తమవుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాల ను కూలదోయడం బీజేపీకే సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మోదీకి వణుకుపుట్టి కుట్ర లు, కుతత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ, దేశ ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలుస్తారన్నారు. బీజేపీ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలతో ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ కవితకు చట్టాలపై అవగాహన, గౌరవం ఉన్నందున కవిత విచారణకు హాజరయ్యారన్నారు. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల విషయంలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పేవరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
బండి సంజయ్ వాఖ్యలను ఖండిస్తున్నాం : అరూరి
ఉద్యమ నాయకురాలు, బతుకమ్మ పండగ విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీ వ్రంగా ఖండిస్తున్నామని, కవిత కు, మహిళాలోకానికి అతడు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ డిమాండ్ చేశారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతామనే బీజేపీ నాయకులు మహిళలపై అనుచిత వాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతున్నదన్నారు. గత ఎనిమిదేళ్లలో తొమ్మిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ఇప్పటికే బండి సంజయ్‌పై ఫిర్యాదులు చేశామని, క్షమాపణ చెప్పే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ‘బండి సంజయ్.. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, బీఆర్ఎస్ నేతలపై, కేసీఆర్ కుటుంబంపై, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని’ అరూరి రమేశ్ హెచ్చరించారు.
బండి ఓ వెదవ… పిచ్చోడు : నన్నపునేని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ వెదవ.. పిచ్చోడని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమరాలు, తెలంగాణ మహిళలను జాగృతం చేసిన ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వాఖ్యలు చేయడంపై నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నీవు అన్న మాటలను నీ తల్లి.. చెల్లిని అడుగు తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఆడబిడ్డ.. ముట్టుకుంటే మసి అయిపోతావు బండి సంజయ్ అని హెచ్చరించారు. ఉన్నతమైన మహిళపై చేసిన బండి వాఖ్యల విషయంలో గవర్నర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమన్నారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ పాల్గొన్నారు.