ములుగు, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ)/ ములుగు రూరల్/ గణపురం : గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నేడు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకొని ప్రభుత్వ అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు. 12 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు.
ఒంటి గంట నుంచి 3గంటల వరకు కలెక్టరేట్లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. 3 గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. సరస్సును సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు.
సాయంత్రం 6 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 6:30గంటలకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద ఉన్న హరిత రిసార్ట్‌కు చేరుకుంటారు. మంగళవారం రాత్రి గవర్నర్ ఇతర అధికారులతో కలిసి బస చేయనున్నారు. బుధవారం ఉదయం 8గంటలకు హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.