చౌటకూర్, మార్చి 6: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు. మెట్లకు రంగులు వేయడం, చెట్లకు సున్నం వేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శనివారం పీఎంశ్రీ సెంట్రల్ టీం పాఠశాలను సందర్శించనున్న దృష్ట్యా గురువారం హెచ్ఎం వేదశ్రీ విద్యార్థిని, విద్యార్థులతో పనులు చేయిస్తున్నారంటూ వీడియోలు, ఫొటోలు తీసి శుక్రవారం వివిధ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి వైరల్ చేశారు.
ఈ విషయమై హెచ్ఎం వేదశ్రీని వివరణ కోరగా, విద్యార్థులతో పాటు తాము కూడా పాఠశాలలో పనులు చేపట్టామని ఆమె వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా తాను పిల్లలతో పనులు చేయించలేదని, పీఎంశ్రీ సెంట్రల్ టీం వస్తుందన్న ఉద్దేశంతో పాఠశాల పరిసరాలు, తరగతి గదులు శుభ్రంగా ఉండాలన్న సదుద్దేశంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పనులు చేపట్టామని తెలిపారు. ఎంఈవో అనురాధ, పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు.