హనుమకొండ, జూలై 26 : చారిత్రక వరంగల్‌ను రాష్ర్టానికి రెండో రాజధాని చేయాలనే సంకల్పంతో నగర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఈమేరకు వరంగల్ అభివృద్ధిపై మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేదర్ రాష్ట్ర సచివాలయంలో పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్, భద్రకాళీ దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్‌రోడ్డు, రైల్వే అంశాలపై చర్చించారు. మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు సంబంధించి అకడ రాజీవ్‌గాంధీ టౌన్షిప్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 1,398మంది లబ్ధిదారులను గుర్తించి 863 ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లోగా ఈ కాలనీకి మౌలిక సదుపాయాల కల్పన పూర్తికావాలని ఆదేశించారు. వెటర్నరీ హాస్పిటల్, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నిర్మించాలని, మెగా టెక్స్టైల్ పార్లో స్థానిక యువతకు ఉపాధి కోసం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2057 వరంగల్ జనాభాకు అనుగుణంగా పెట్టుకొని రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ పనులను త్వరగా మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రకాళీ ఆలయ మాడవీధులు, కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణ పనులను వచ్చే దసరాలోపు పూర్తయ్యేలా ప్రణాళిక ఉండాలన్నారు. రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జితో పనులు వచ్చే డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయంలో యంత్రాల సాయంతో భోజన తయారీ కేంద్రంలో చేపడతామని, దీనికి తగ్గట్టుగా నిర్మాణ వ్యవస్థ ఉండాలన్నారు. వానాకాలం పూర్తయిన వెంటనే భద్రకాళీ చెరువులో మట్టిని తరలించాలని సూచించారు. చెరువులో ఇప్పటివరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని 2.06 కోట్ల రూపాయిల మట్టిని విక్రయించామని అధికారులు వివరించారు.
నగర అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల డీపీఆర్, టెండర్ పనులు ప్రారంభించడానికి, పూర్తి చేసేందుకు నిర్దేశిత గడువును నిర్ణయించుకోవాలని చెప్పారు. వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు, హాస్పిటల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందేలా చూసేందుకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయిక్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కలెకర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.