నర్సంపేట, ఫిబ్రవరి 3 : వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. గతంతో పోల్చితే 10-15 రోజుల ముం దుగానే మక్కలు మార్కెట్కు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 2,200 ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యా పారులు క్వింటాకు రూ.2,350 నుంచి రూ. 2, 450 వరకు ధర పెట్టి ఇదే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ. 250 వరకు అదనంగా వస్తుండడంతో రైతులు వారివైపే మొగ్గు చూపుతున్నారు. నాలుగైదు రోజులుగా అన్ని మార్కెట్లు మక్కలతో కళకళలాడుతున్నాయి.
తేమ శాతం తక్కువగా ఉన్న మక్కలనే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మాయిశ్చర్ 14-15 శాతం ఉండేలా చూసుకోవాలని వ్యాపారులు రైతులకు సూచిస్తున్నారు. పూర్తిగా ఆరిన తర్వాతనే మక్కలను మార్కెట్కు తీసుకురావాలంటున్నారు. దీంతో పలువురు రైతులు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి మక్కలను ఆరబోసి విక్రయిస్తున్నారు.
ఈ ధఫా మక్కలు మార్కెట్ యార్డుకు 10 రోజుల ముందుగానే వచ్చాయి. గతంలో ఫిబ్రవరి రెండో వారంలో వచ్చేవి. రైతులు వానకాలంలో పత్తి సాగు చేయగా ఒకసారి మాత్రమే పంట ఏరి దానిని తొలగించారు. దానిస్థానంలో నవంబర్ చివరలో మక్కజొన్న పంట వేశారు. ఈ పంట 15 రోజుల ముందుగానే కోతకు రావడంతో రైతులు మార్కెట్కు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 56,150 ఎకరాల్లో మక్కజొన్న సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నెక్కొండ మండలంలో 13,450 ఎకరాలు, చెన్నారావుపేటలో 11,380, దుగ్గొండిలో 10,890, నల్లబెల్లిలో 9,880, నర్సంపేటలో 7,500, ఖానాపూర్ మండలంలో 3,050 ఎకరాల్లో మక్కజొన్న పంట వేసినట్లు వారు పేర్కొన్నారు.