ఖిలావరంగల్, జూన్ 4 : మామునూరు ఎయిర్ పోర్టు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు కాన్సెంట్ అవార్డుగా ఎకరానికి రూ. 1.20 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన నెగోషియేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అంగీకరించి సహకరించాలని రైతులను కోరారు.
అలాగే గంటూరుపల్లి రైతుల కోరిక మేరకు రోడ్డుకు సంబంధించిన నివేదికను తయారుచేసి జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న హక్కుదారులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ అధికారులు, గంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి రైతులు పాల్గొన్నారు.