హనుమకొండ సిటీ/గిర్మాజీపేట, జూన్ 11: పాఠశాలలు నెలన్నర వేసవి సెలవుల తర్వాత సోమవారం తెరుచుకోనున్నాయి. సెలవుల్లో బంధువులు, టూర్లకు వెళ్లిన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సంసిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మూసి ఉన్న పాఠశాలల్లో పారిశుధ్య పనులను ప్రధానోపాధ్యాయులు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు అన్ని వసతులను కల్పించింది. తల్లిదండ్రులకు భారం కావద్దని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనుంది. స్టడీ సామగ్రి అంతా ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. ఆయా సామగ్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ, తల్లిదండ్రుల సమక్షంలో పంపిణీ చేయనున్నారు.
యూనిఫామ్స్, స్టడీ సామగ్రి..
విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ప్రారంభం రోజే అందించేందుకు అన్నిఏర్పాట్లు చేశారు. హనుమకొండ జిల్లాలోని 42,034 మంది విద్యార్థులు (బాలికలు 20,718, బాలురు 21,586) ఉండగా, రెండు జతల యూనిఫామ్స్ అందిస్తుండగా మెదటిరోజు ఒక్కో జతను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. మిగతా జతను ఈనెల 20న ఇవ్వనుంది. ఈ ఏడాది నుంచి నూతనంగా జిల్లాలోని లోకల్, ప్రభుత్వ స్కూల్స్, యూఆర్ఎస్, కేజీబీవీ, టీఆర్ఈఐస్, మోడల్ స్కూల్స్‌లోని 23,063 మంది విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే నోట్ బుక్స్‌ను అందజేయనున్నారు. ద్విభాషలో ముద్రించిన పాఠ్యపుస్తకాలు ఎంఈవో ఆఫీసుల నుంచి పాఠశాలలకు చేరాయి.పెండింగ్‌లో ఉన్న కొన్ని టైటిల్స్‌ను ఈనెల 20వరకు విద్యార్థులకు అందజేయనున్నారు.
పాఠశాల ముస్తాబు
ప్రోఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 3 నుంచి 9 వరకు అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వ కృషిని తెలియజేశారు. ఈ క్రమంలో 3,279 విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. నేటి నుంచి నిర్వహించే రెండోదశ బడిబాటలో భాగంగా ‘మన ఊరు- మన బడి’పై అవగాహన కల్పించనున్నారు. పాఠశాలలను అందంగా ముస్తాబు చేసి, విద్యార్థులకు రంగోళీ కార్యక్రమాలు నిర్వహించి పాఠశాలలకు ఎస్ఎంసీ, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులను ఆహ్వానించి ‘మన మన బడి’లో భాగంగా పాఠశాలకు వెచ్చించిన నిధులపై అవగాహన కల్పించనున్నారు.
విద్యాదినోత్సవం రోజు రాగిజావ పంపిణీ
ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ప్రార్థన సమయంలో జావ పంపిణీని దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న నిర్వహించే రోజు నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పర్యవేక్షణ పారదర్శకతలో భాగంగా ఉపాధ్యాయులకు అందించే 334 ట్యాబ్స్, 74 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ప్రారంభించబోతున్నారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసిన మోడల్ స్కూల్స్‌ను అదే రోజు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.
వరంగల్ జిల్లాలో
వరంగల్ జిల్లాలో బడిబాట కార్యక్రమంలో పాఠశాలల్లో 3,635 మంది విద్యార్థుల పేర్లు నమోదు చేసినట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. పూర్వప్రాథమిక విద్యలో 151, ఒకటో తరగతిలో 1549, 2 నుంచి 12వ తరగతి వరకు 1,935 మందిని కొత్తగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో 54,841 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉండగా వారి కోసం 2,97,890 పుస్తకాలు అవసరం కాగా 2,48,242 (82శాతం) పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాములకు వచ్చాయి. వాటిలో జిల్లా అధికారులు 76 శాతం ఎమ్మార్సీ భవనాలకు సరఫరా చేశా రు. త్వరలోనే జిల్లాకు కావాల్సిన పుస్తకాలు అందనున్నట్లు అధికారులు తెలిపారు.
పుస్తకాలతో పాటు నోట్‌బుక్స్ ఉచితం
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్ కూడా అందజేయనున్నా. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2,42,951 నోట్‌బుక్స్ అవసరం కాగా..95,207(38శాతం) నోట్‌బుక్స్ వచ్చాయి. రెండు, మూడు రోజుల్లోనే మిగతా నోట్‌బుక్స్ జిల్లా కేంద్రానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. పాఠ్య పుస్తకాలతోపాటు 6, 7 తరగతులకు 6 లాంగ్ నోట్‌బుక్స్, 8వ తరగతికి 7, 9, 10 తరగతులకు 14 చొప్పున, 11, 12వ తరగతికి 12 నోట్‌బుక్స్ పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.