సర్కారు పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించి పనులను కొనసాగించింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పరిస్థితి తారుమారైంది. మన ఊరు – మన బడి పనులకు కొత్త సర్కారు మంగళం పాడి, అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధి పనులను మొదలు పెట్టింది.
అయితే అప్పటికే పనులు చేసిన పాత కాంట్రాక్టర్లకు మొండిచేయి చూపింది. ఒక్కొక్కరు దాదాపు రూ. 20 లక్షల వరకు అప్పులు చేసి పనులు చేయగా, ఇందులో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాత పనులను కాదని, కొత్తగా తాము చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలకు బిల్లులు క్లియర్ చేస్తున్నది. పెండింగ్ బిల్లులు చెల్లించడంలో వివక్ష చూపుతున్నది. దీంతో పాత పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధుల విడుదలలో ప్రభుత్వ పక్షపాత వైఖరిపై మండిపడుతున్నారు. కాగా, విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడిచినా పూర్తిస్థాయి సౌకర్యాలు లేక విద్యార్థులు సతమతమవుతున్నారు. అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 149 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇందులో 50 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పనులు జరగగా, మిగిలిన వాటిలో 65 శాతం మేర పూర్తయ్యాయి. ఈ పథకం కింద 78 పాఠశాలల్లో 315 గ్రీన్ చాక్ బోర్డులు బిగించారు. అలాగే 52 పాఠశాలకు 1,952 డ్యుయల్ డెస్క్లు సరఫరా చేశారు. ఉన్నత పాఠశాలలన్నింటికీ ఇంటరాక్షన్ ప్యానెల్ ప్లాట్ఫాం స్క్రీన్లను అందించి డిజిటల్ విద్యను బలోపేతం చేశారు. 90 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. కాగా, ఈ పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 22.62 కోట్లు మంజూరు చేసింది. పనులు కొనసాగిస్తున్న క్రమంలోనే ఎన్నికలు రావడం, బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో పనులు, రూ. 11.17 కోట్ల బిల్లులు పెండింగ్లో పడ్డాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులను, బిల్లులను పక్కన పెట్టి కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పనులను ప్రారంభించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని, బిల్లులను పెండింగ్లో పెట్టింది. జిల్లాలో కొత్తగా 265 స్కూళ్లను అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద ఎంపిక చేసి రూ. 12.41 కోట్లు (డీఎంఎఫ్టీ నిధులు) మంజూ రు చేసింది. పని ప్రారంభంలోనే 25 శాతం నిధులు (రూ. 3.10 కోట్లు) కాంట్రాక్టర్లకు చెల్లించింది. ప్రస్తుతం 220 పాఠశాలల్లో అన్ని పనులు పూర్తయ్యాయి. పనుల పురోగతిని బట్టి డబ్బులు చెల్లిస్తున్నారు. కాగా, మన ఊరు-మన బడి బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉండడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి పనులు చేశామని, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, తమ బిల్లులు ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.