పంట పండించడానికి రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. వాటిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కాంటాలు కాక.. లారీలు రాక సెంటర్ల నుంచి బస్తాలు కదలక తీరని వ్యథను అనుభవిస్తున్నారు. తమ గోసను తీర్చేదెవరని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
కొడకండ్ల, మే 18 : కొనుగోలు కేంద్రానికి మక్కలను తీసుకొచ్చి నెల రోజులవుతున్నా కాంటా పెట్టకపోవడంతో విసిగిపోయిన రైతులు కన్నీళ్లో వాటిని మరో మార్కెట్కు తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జి ల్లా కొడకండ్ల మండలకేంద్రంలోని మకల కొనుగోలు కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని లక్ష్మకపల్లి నుంచి రైతులు వాంకుతోడ్ విజయ్, వాంకుతోడ్ లాస్యతోపాటు మరో నలుగురు రైతులు నెల రోజుల క్రితం సుమారు 250 క్వింటాళ్ల మక్కలను తీసుకొచ్చారు. ఎంతో ఆశతో, రవా ణా ఖర్చులు భరించి మక్కలను తీసుకొస్తే నేటికీ కాంటా పెట్టలేదు.
కొనుగోలు కోసం టోకెన్లు ఇవ్వాలని వీరు అధికారులను వేడుకున్నా ఫలి తం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఎండల్లో ఇబ్బందులు పడుతూ నిరీక్షిస్తున్నా మక్కలను కొనుగోలు చేయలేదు. కాంటా పెట్టాలని కోరితే రేపు మాపు అంటూ కాలయాపన చేయడంతో రైతుల ఓపిక నశించింది. మరోవైపు అకాల వర్షాల భయం, మక్కలను భద్రపరచడానికి అధికారులు ఎలాంటి సహకారం అందించలేదు. దీంతో విసిగిపోయిన రైతులు మక్కలను బస్తాల్లో నింపి సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి తరలిస్తున్నారు.
శాయంపేట, మే 18 : మక్క రైతులు ఎర్రటి ఎండలో లారీల కోసం రోడ్డెక్కారు. లారీలు ఆపకపోవడంతో ఆగ్రహించి హైవేపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. హనుమకొండ జిల్లా శాయం పేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని మక్కల కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన మక్కలను తరలించడంలో జాప్యం జరుగుతున్నదని రైతులు ఆందోళన చెందారు. పోలీసులు, పీఏసీ ఎస్ సీఈవో రాజమోహన్తో కలిసి మాందారిపేట హైవేపైకి వెళ్లి భూపాలపల్లి వైపు ఖాళీగా వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు.
బస్తాకు రూ.30 చెల్లిస్తామని భూపాలపల్లికి తీసుకెళ్లి దిగుమతిచేయాలని రైతులు వేడుకున్నారు. కానీ, ఏదో ఒక సాకు చూపి లారీలు ఆపకపోవడంతో హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కనిపిం చిన లారీలకు రైతులు ఎదురెళ్లి ఆపేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. లారీలను తెప్పించి మక్కలను గోదాముకు పంపించాలని రెండు చేతులు జోడించి సీఈవోను వేడుకోగా, మూడు లారీలు తెప్పిస్తున్నానని నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు.