ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి ఎగనామం పెట్టే అవకాశం కనిపిస్తున్నది. గతేడాది సైతం చెరువుల్లో కేవలం 50 శాతం సీడ్ వేసి చేతులు దులుపుకున్నది. ఇప్పుడు మొత్తానికే మంగళం పాడి మత్స్యకారుల ఉపాధి గండికొట్టనున్నది. ఇప్పటి వరకు కనీసం టెండర్లు కూడా పిలువ కపోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. గత సంవత్సరం పంపిణీ చేసిన చేప పిల్లలకు స ర్కారు డబ్బులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. దీంతో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
– జయశంకర్ భూపాలపల్లి, జూలై 18(నమస్తే తెలంగాణ)/ వర్ధన్నపేట
కేసీఆర్ కులవృత్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూర్వవైభవం తీసుకురాగా రేవంత్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను బలోపేతం చేయడంతో గొల్లకుర్మలు, ముదిరాజ్ తదితర చేతివృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెం దారు. కాగా ప్రస్తుతం మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ముదిరాజ్‌లకు ప్రధానంగా చేయూతనిచ్చిన ఉచిత చేప పిల్లల(సీడ్) పంపిణీ పథకానికి కాంగ్రెస్ సర్కారు స్వస్తి పలికేందుకే టెండర్లు పిలవడం లేదని తెలుస్తున్నది. జూన్, జూలై నెలల్లో టెండర్లు పిలిచి, ఆగస్టు మొదటి వారంలో చెరువుల్లో చేప పిల్లలను వదలాల్సి ఉండగా, ఇంతవరకు టెండర్లే పిలువలేదు. గత సంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా 50 శాతం సీడ్ పంపిణీ చేయడంతో చేపలు ఎదగలేదని, దీంతో చాలా నష్టపోయామని మత్స్యకారులు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా జూలై, ఆగస్టులోనే చేప పిల్లలను చెరువుల్లో వదిలేదని తెలుపుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 832 చెరువులు, మూడు రిజర్వాయర్లుండగా 116 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 8 785 మంది సభ్యులున్నారు. 25 మహిళా మత్స్య సహకార సం ఘాలున్నాయి. జిల్లాలో 2022-23వ సంవత్సరంలో 3 కోట్లు, 2023-24లో 2.57 కోట్ల చేప పిల్లలను ఆగస్టు మొదటి వారంలో పే చెరువులకు చేర్చి ముదిరాజుల కళ్లలో ఆనందాన్ని నింపింది. వ రంగల్ జిల్లాలో 732 జలాశయాలుండగా, 142 సొసైటీల్లో 14,200 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ చే యకుంటే మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోనున్నాయి.
టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలంటే కనీసం 45 రోజులు పడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించినా చేప పిల్లలు వదలడానికి మరో రెండు మూడు నెలలు పడుతుంది. ఇంత ఆల స్యంగా చేపలు వదిలితే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుంది. ఈ క్రమంలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం బరాజుల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను గత ప్ర భుత్వం ఉచితంగా పంపిణీ చేసి మత్స్యకారులకు అండగా నిలిచింది. అయితే మేడిగడ్డ బరాజ్ లో ఒక పిల్లర్ కుంగడంతో సర్కారు నీటిని వృథాగా దిగువకు వదిలేస్తున్నది. కుంగి రెండేళ్లు సమీపిస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయకపోవడంతో రెండు బరాజ్‌లలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేక చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. గతంలో అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లలో 35 లక్షల చొప్పున చేప పిల్లలను పంపిణీ చేసేవారు.