జనగామ, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : భూముల మారెట్ విలువలను భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సొంతింటి కలతో జీవిస్తున్న సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు పెను ఆర్థిక భారం కాబోతున్నది. భూమి కేవలం పెట్టుబడి కాదు.. అది ఒక కుటుంబ భద్రత.. ఒక సగటు తండ్రి జీవితకాల కలను ప్రభుత్వం కల్లలు చేసే చర్యలకు పూనుకోవడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర (కమర్షియల్) భూమి వాల్యుయేషన్ పెంపు వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు కానీ.. పేద ప్రజల ఆశలు, మధ్యతరగతి కలలు ఖరీదైపోతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
మారెట్ రేట్లకు అనుగుణంగా సవరణ చేస్తున్నామని చెబుతూ పరోక్షంగా ప్రజలపై పన్నుల భారం మోపి ప్రత్యక్షంగా అదనపు ఆదాయంతో ప్రభుత్వ ఖజానా నింపుకుంటున్నది. వ్యవసాయ భూములపై 2.75 శాతం, గ్రామీణ ప్రాంతాల ఓపెన్ ప్లాట్లు (ఖాళీ స్థలాల) 78శాతం, నగరాలు, పరిసర ఓపెన్ ప్లాట్లపై 100శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో 500శాతం వరకు, అపార్ట్మెంట్ల విలువ కూడా గణనీయంగా పెరగనున్నది.
దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రానుంది. ఉమ్మడి జిల్లాలో భూముల విలువ పెంపునకు సంబంధించి మండలాల వారీగా తయారు చేసిన నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. ఈనెల 5 (నేటి నుంచి) పెంచిన ధరలు అమల్లోకి రానుండగా, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు, మూడు నెలల వాయిదాల పద్ధతిలో అగ్రిమెంట్లు (ఒప్పందం) చేసుకున్న వారు ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. కొత్తగా ప్రతిపాదించిన ధరలు గురువారం రాత్రి వరకు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉండడంతో పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో బారులు తీరారు. భూమి విలువ పెరగడం వల్ల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం లేకపోయినా ప్రభుత్వానికి మాత్రం అదనపు ఆదాయం వస్తుంది.
ఒక మధ్యతరగతి కుటుంబం రూ.30 లక్షల విలువైన ప్లాట్ కొనుగోలు చేస్తే పాత విలువ ప్రకారం 4శాతం స్టాంపు డ్యూటీతో రూ.1.20లక్షలు చెల్లించాలి. కానీ కొత్త విలువ ప్రకారం అదే ప్లాట్‌కు అంతే స్టాంపు డ్యూటీ కింద రూ.1.80లక్షల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, చాలా ప్రాంతాల్లో పెంపు 100శాతం దాటితే భారం ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వానికి అధిక ఆదాయం రావడంతో పాటు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల భూముల విలువ పెరుగుతుంది. పెద్ద భూస్వాములు ఆస్తి విలువ పెరుగుతుంది.
బ్యాంకులు అధిక లోన్లు ఇస్తాయి. నష్టం ఎవరికంటే పేదలు ఇల్లు కొనలేరు. మధ్యతరగతి ప్రజలకు అదనపు రిజిస్ట్రేషన్ భారం పడుతుంది. చిన్న ఉద్యోగులపై అప్పుల భారం పెరుగుతుంది. ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు స్థలాల ధరలు, మారెట్ విలువలు పెంచి అదే పేదల సొంత ఇంటి కలను మరింత దూరం చేస్తున్నది. సర్కారు నిర్ణయం వల్ల ధనికులకు లాభం, పేదలకు నష్టం జరుగుతుంది. 100 గజాల వరకు ఉన్న స్థలాలకు పెంపు రద్దు చేసి, మొదటిసారి ఇల్లు కొనేవారికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు సహా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ రాయితీలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.