హనుమకొండ, అక్టోబర్ 10 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన హ నుమకొండ రాంనగర్లో తన నివాసంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఒడితెల సతీశ్‌కుమార్, శంకర్‌నాయక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అబద్ధాలను నిజం, నిజా న్ని అబద్ధాలుగా మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తుపాకీ రాముడి మాటల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.2 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉందన్నారు. గ్రామాల్లో మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, నిధుల లేమితో అభివృద్ధి కుంటుపడి సమస్య లు పేరుకుపోతున్నాయన్నారు.
పాలన తెలియని సీఎం, అవగాహన లేని మంత్రులతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాల్లో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి తిరగలేని పరిస్థితి ఉందన్నారు. ఎవరు ఎవరి కుర్చీ లాక్కుంటారోననే భయంతో ఉన్నారని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకొనేందుకు బీసీలకు 42శాతం రిజర్వేషన్‌కు తాము కట్టుబడి ఉన్నాం.. కానీ, కోర్టు ఆపిందని చెప్పుకొనేందుకు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా కాంగ్రెస్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలపై ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం తో కొట్లాడాలని, మేమంతా కలిసి వస్తామని తెలిపారు. గతంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసలు రాష్ర్టాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వ డం నేరమని, రిజర్వేషన్ల గురించి అడిగితే జైల్లో పెట్టాలని మాట్లాడిన వీడియో రికార్డు ను చూపించారు.
ఇప్పుడు రేవంత్‌రెడ్డిని ఏ జైల్లో పెట్టాలని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే ప్రతి నెలా గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే రూ.300 కోట్లు, రాష్ట్రం నుంచి వచ్చే మరో రూ.300 కోట్లు రావడం లేదని, దీంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇన్ని రోజు లు కాలయాపన చేసి కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోయాయని చెప్పుకొనేందుకు సిగ్గులేదా.. అని ప్రశ్నించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితమని, భర్తలపై డబుల్ భారం మోపుతున్నారని, ఉచితానికి సంబంధించి ఆర్టీసీకి ఇప్పటికే రూ.1300 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. బీసీలను ఇప్పటికే మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి 42శాతం రిజర్వేషన్‌పై చట్టం తీసుకురావాలని, బీసీలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘హైకోర్టు స్టేతో కాంగ్రెస్ ప్రభుత్వం చెంప చెల్లుమంది. గువ్వ గుయ్యిమన్నది. రేవంత్‌రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడిదిలో ఎలుక పడినట్లుగా అయింది’ అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. 42 శాతం రిజర్వేషన్‌పై ఒకసారి రాజ్యాంగ బద్ధమని, ఇంకోసారి ఆర్డినెన్స్ ద్వారా అని, మరోసారి బిల్లు ద్వారా అని ఇంకోసారి జీవో ద్వారా అంటూ కాంగ్రెస్ పూటకో మాట మాట్లాడుతున్నదన్నారు. దేశంలోనే సీఎం రేవంత్‌రెడ్డిలాంటి జోకర్, చిల్లర, సైకో ఎవరూ లేరన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అతడిని పక్కన పెట్టినట్లు తెలిసిందన్నారు. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రదక్షిణలు చేసినా అధిష్టానం కలువడం లేదన్నారు.
కాంగ్రెస్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకను సైతం తప్పుదారి పట్టించి అలవికాని హామీలు ఇప్పించి ఇరికించారన్నారు. కేంద్రంలో బడేబాయి మోదీని ఎక్కువ సార్లు కలిసింది సీఎం రేవంత్‌రెడ్డినే అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల తర్వాత కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీల విషయం లో ప్రజలకు క్షమాపణ చెప్పి ఒక్కొక్కటి అమలు చేస్తామని కోరాలని, లేనిపక్షంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డును ప్రదర్శించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు చింతల యాదగిరి, జోరిక రమేశ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.