సంగెం/బయ్యారం, మార్చి 28 : ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు గోస పడుతున్నారు. ఎన్నికల వేళ పేదల సొంతింటి కళను సాకారం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలతోపాటు అధికారుల నిర్లక్ష్యం పేదల పాలిట శాపంగా మారుతున్నది. కొన్నిచోట్ల అన్ని అర్హతలున్నా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోగా, మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో మంజూరైనా కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని అర్హులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడిన వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన దుడ్డె సునీత, ప్రభాకర్ దంపతులకు నిరాశే ఎదురైంది. ఇందిరమ్మ ఇల్లు కోసం మొదటి విడుతలో దరఖాస్తు చేసుకోగా, అధికారులు పరిశీలించి తిరస్కరించారు. ఇదేంటని అడిగితే.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, ఆరు సిమెంటు బస్తాలు కూడా వచ్చాయని, గతంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నట్లు కంప్యూటర్లో చూపిస్తున్నదని, ఇప్పుడు మీకు ఇల్లు మంజూరు కాదని చెప్పడంతో ఆ దంపతులు అవాక్కయ్యారు.
ఈ సందర్భంగా సునీత, ప్రభాకర్ దంపతులు మాట్లాడుతూ.. తమకు ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదని, అద్దె ఇంట్లో నివాసముంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం హయాంలో తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంలో పునాదుల వరకు కట్టామని, అప్పుడు ప్రభుత్వం ఆరు సిమెంట్ బస్తాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇంటి నిర్మాణాన్ని పునాది దశలోనే ఆపేశామని చెప్పారు. అప్పటి నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నామన్నారు.
తాము ఇల్లు కట్టుకోలేదని, అది పునాదుల్లోనే ప్రత్యక్షంగా కనపడుతున్నదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. తమ కుటుంబం తాతముత్తాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ కార్యకర్తలమైన తమకే ఇల్లు ఇవ్వడంలేదని వాపోయారు. కంప్యూటర్లో అలా ఉంటే మేమేమీ చేయలేమని దాట వేస్తున్నారని, అధికారులు, ప్రజాప్రతినిదులు ప్రత్యక్షంగా వచ్చి తాము పునాది వరకు కట్టుకున్న ఇంటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సునీత, ప్రభాకర్ కోరారు.
పూరిగుడిసెలో ఉంటున్న పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్న సంతోషం ఎంతో కాలం నిలువలేదు. విద్యుత్ తీగలు అడ్డు రావడంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయి ఏడాది దాటినా పట్టించుకునే వారు లేక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ పంచాయతీ ప్రభుత్వం ఇందిరమ్మ మోడల్ విలెజ్గా ఎంపిక చేసి, గత ఏడాది జనవరిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో రాయికుంట గ్రామానికి చెందిన బసనబోయిన స్వప్నకు ఇల్లు రావడంతో వెంటనే పనులు ప్రారంభించింది.
నెల రోజుల్లోనే బెస్ లెవల్ వరకు పూర్తి చేయగా, బిల్లు రావడంతో గోడలు నిర్మాణం ప్రారంభించింది. అయితే, విద్యుత్ తీగలు అడ్డుగా ఉండడంతో నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేసింది. ఈ క్రమంలోనే విద్యుత్ అధికారులను సంప్రదించగా, విద్యుత్ తీగల తొలగింపునకు డీడీ కట్టాలని చెప్పడంతో అంత స్థోమత లేక నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఇండ్ల పురోగతి తెలుసుకునేందుకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు స్వప్న తన గోడు వెల్లబోసుకున్నది. విద్యుత్ తీగలు అడ్డుగా ఉండడంతో ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని చెప్పడంతో, ఆయన అక్కడి నుంచే జిల్లాస్థాయి విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి, పేద కుటుంబాలు డీడీ ఎలా కడుతారని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఇందిరమ్మ ఇండ్లకు అడ్డు వచ్చిన తీగలను విద్యుత్ శాఖనే తొలగించాలని ఆదేశించారు.
దీంతో అధికారులు కరెంటు తీగలు తొలగిస్తామని ఆమెకు హామీ ఇచ్చి వెళ్లారు. కానీ, ఇప్పటివరకు తొలగించకపోవడంతో ఏడాది కాలంగా ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. దీంతో ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇటుక, సిమెంట్, ఇసుక, ఐరన్ వంటి సామగ్రి పాడైపోతున్నదని స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తమతోపాటు ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారు గృహ ప్రవేశాలు చేశారని నిరాశ చెందుతున్నది.
ఇల్లు లేక కిరాయికి ఉంటున్నం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పునాదుల వ రకు కట్టుకున్న తర్వాత ఆర్థిక సమస్యలతో నిలిపేశాం. అప్పుడు ఆరు సిమెంటు బస్తాలు ఇచ్చేటప్పుడు నా భార్య సునీత ఆధార్ నంబర్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకా ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నం. కానీ ఇల్లు మంజూరు కాలేదు. ఎందుకు కాలేదని అధికారులను అడిగితే.. మీకు గతంలో ఇల్లు మంజూరైనట్లు కంప్యూటర్లో చూపిస్తున్నది.. ఇప్పుడు మీకు ఇల్లు రాద ని చెప్పారు. దీంతో తాము దిక్కుతోచని స్థితిలో పడిపోయాం. ఎవరి దగ్గరకు వెళ్లినా పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా వచ్చి పరిశీలించి మమ్ములను ఆదుకోవాలి.
– దుడ్డె ప్రభాకర్, బాధితుడు, మొండ్రాయి
ఇందిరమ్మ ఇల్లు వచ్చింద ని సంతోష ప డ్డాం. విద్యుత్ తీగల అడ్డుతో ఏడాది క్రితమే ఇంటి నిర్మా ణం నిలిపోయింది. విద్యుత్ అధికారుల వద్దకు వెళ్లి చెప్పినా పట్టించుకోవడంలేదు. ఇంత వరకు తీగలు తొలగించ లేదు. ప్రస్తుతం అత్తగారింట్లో ఉంటున్నాం. ఇంటి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో అర్ధం కావడం లేదు.
– స్వప్న, ఇందిరమ్మ లబ్ధిదారు, రాయికుంట