ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బుధవారం హరిత కాకతీయ హోటల్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి పర్యటనలో భాగంగా వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో రూ. 181.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కార్మిక, ఫూలే భవనాలకు భూమి పూజ, అలాగే నక్కలగుట్టలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, ప్రతిపక్షాలు తమ చిల్లర రాజకీయాల కోసం రైతులను అయోమయానికి గురి చేయొద్దని హితవు పలికారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండ, మే 3 : హనుమకొండ జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో సుమారు రూ.181.45కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హుస్నాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న కిట్స్ కళాశాలకు చేరుకొని ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే, అక్కడి బాలాజీ గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. జిల్లా కేంద్రంలో కార్మిక భవన్, ఫూలే భవన్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారని, అలాగే, బాలసముద్రంలో నిర్మించిన హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అనుబంధ సంఘాల సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. వంద కోట్లతో పనులు జరుగుతున్న సమ్మయ్యనగర్, నయీంనగర్ నాలా ఎక్స్టెన్షన్ పనులకు హెచ్డీఎఫ్ నుంచి రూ. 90 కోట్లు మంజూరు చేశారని, దీనికి మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే, రూ.3కోట్లతో బంధం చెరువు ప్యూరిఫికేషన్ పనులకు భూమి పూజ చేస్తారని చీఫ్ విప్ తెలిపారు. హనుమకొండలోని ఎల్బీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్, హంటర్‌రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్ ఆవరణలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్, 57వ డివిజన్లో నిర్మించిన మోడల్ వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారన్నారని పేర్కొన్నా రు. సాయంత్రం కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మే నెలంతా కార్మిక, ఉద్యోగ సంక్షేమ మాసంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం తెలిపారు. ప్రతి సంవత్సరం అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 6,960 మంది కార్మికులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ ఇటీవల పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు భరోసా కల్పించా రన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించారన్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. హసన్‌పర్తిలో మోడల్ దోభీఘాట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతులకు భరోసా ఇవ్వకుండా వారిని పరేషాన్ చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పంట నష్టపరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.