తొర్రూరు, డిసెంబర్ 29 : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను త్వరగా అమలు చేయాలని, జాప్యం చేయొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం తొర్రూరు పార్టీ కార్యాలయంలో ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపై ఆరా తీశారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల వరకు హామీల అమలును దాటేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని, ఖజానా ఖాళీగా ఉందని ఆరోపణలు చేస్తూ, హామీలను వాయిదా వేస్తూ రోజులు గడుపుతున్నదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసిందని ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో ఆస్తులు పెంచిన విషయాన్ని దాటవేస్తున్నదని అన్నారు. నాణ్యమైన కరెంట్, సాగునీటితో పరిశ్రమలు, వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చారని, రైతుబంధు వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. పౌరసరఫరాల శాఖ, విద్యుత్‌శాఖలో అప్పుల గురించి చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలో అప్పులు చేయని రాష్ట్రం లేదని, తెలంగాణలో కూడా కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నిబంధనలకు లోబడి అప్పులు తెచ్చిందని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టేలా ప్రభుత్వం దరఖాస్తుల షో నిర్వహిస్తున్నదని, మున్ముందు ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయన్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల మేర వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని, ప్రజాశ్రేయస్సు కోసం వాటిని పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సహకారం అందించాలన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు డాక్టర్ పీ సోమేశ్వర్రావు, పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు ఎన్నమనేని శ్రీనివాసరావు, దొంగరి శంకర్, కాలునాయక్, బిజ్జాల అనిల్, కర్నె నాగరాజు, తూర్పాటి రవి, గుండాల నర్సయ్య, కుర్ర శ్రీనివాస్, జంపా, సుధీర్, యాదగిరిరావు, ముత్తినేని శ్రీనివాస్, కిరణ్, రాయిశెట్టి వెంకన్న, వినయ్ పాల్గొన్నారు.