ఖిలావరంగల్, అక్టోబర్ 28: వరంగల్ రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు మంగళవారం అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు. వరంగల్ జీఆర్పీ సీఐ శ్రీ పి. సురేందర్ తెలిపిన కథనం ప్రకారం.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ రాము, హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, శ్రీనివాస్, ఆర్పీఎఫ్-సీఐబీ సిబ్బంది హెచ్సీలు ఎ.ఏడుకొండలు, ఎన్. రమేష్ లతో కలిసి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం నంబర్ 3 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో తనిఖీలు నిర్వహించాము. ఈ తనిఖీలు హైదరాబాద్ చార్మినార్ కు చెందిన చందునాయక్ (45) అనుమానాస్పదంగా కనిపించాడు.
వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని భాగము తనిఖీ చేయగా అందులో రూ1.30 లక్ష విలువ కలిగిన 11 గ్రాముల బంగారు చెవి కమ్మలు, గొలుసు లభించాయి. విచారణలో ఆభరణాలు సాయి నగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రైలులో వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో
పోలీసులు పంచుల సమక్షంలో ఆభరణాలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. దొంగతనాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే రైల్వే పోలీసులకు గాని అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు తెలిపారు.