జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గోదావరి సాక్షిగా ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది. కాంట్రాక్టర్ల అండదండలతో ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక తరలుతున్నది. అలాగే క్వారీల వద్ద అదనపు బకెట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఓవర్ లోడ్, జీరో దందాలో పోలీసులకు పట్టుబడుతున్న లారీలే ఇందుకు నిదర్శనం. లారీల్లో అదనంగా ఒక బకెట్ ఇసుక నింపితే రూ. 7,200 వసూలు చేస్తున్నట్లు పలువురు లారీ యజమానులే పేర్కొంటున్నారు.
కాట్రాక్టర్లు కూటమి కట్టి ఇసుక దోపిడీ తెగబడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుకను తరలిస్తున్నారంటే క్వారీల వద్ద అవినీతి ఏ మేరకు జరుగుతుందో అవగతమవుతుంది. పోలీసులు ఇటీవల పట్టుకున్న ఇసుక లారీల్లో ఆన్లైన్ బుకింగ్ లేనివే అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నా టీఎస్ఎండీసీ అధికారులు నోరు మెదపడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండలంలోని గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీల్లో రోజుకు రూ. లక్షల్లో జీరో, అదనపు బకెట్ దందా జోరుగా సాగుతున్నది.
మహదేవపూర్ మండలం పరిధిలో మొత్తం 13 క్వారీలుండగా, ప్రస్తుతం నాలుగింటి నుంచి మాత్రమే ఇసుక రవాణా జరుగుతున్నది. మద్దులపల్లి క్వారీ నుంచి 60, విలాసాగర్ 50, పెద్దంపేట నుంచి 40, పంకెన క్వారీ నుంచి 60 లారీలు ప్రతిరోజూ ఇసుక రవాణా చేస్తున్నాయి. ఈ క్వారీల్లో జీరో, అదనపు బకెట్ దందా జోరుగా సాగుతున్నట్లు పోలీసులు పట్టుకుంటున్న లారీల ద్వారా తెలుస్తున్నది. సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు అదనపు బకెట్ ఇసుకకు రూ. 2 వేలు, లోడింగ్ చార్జి రూ. 3,500, ఆపరేటర్‌కు రూ.500, లేబర్‌కు రూ. 1,000, కాంటాకు రూ. 200 చొప్పున ఒక్కో లారీ నుంచి రూ. 7,200 వసూలు చేస్తున్నట్లు లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. మరో అదనపు బకెట్‌కు కూడా రూ. 2 వేలు వసూలు చేస్తున్నట్లు చెపుతున్నారు.
ఒక బకెట్‌కు 5 టన్నుల చొప్పున ప్రతి లారీలో రెండు బకెట్ల (10 టన్నులు) ఇసుక తరలిపోతున్నది. ఇలా రోజుకు 200 లారీల నుంచి సుమారు రూ. 18 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అదనపు ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇందులో టీఎస్ఎండీసీ అధికారులకు వాటాలు ముడుతున్నాయని, అందువల్లే వారు నోరు మెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నెలలోనే సుమారు 20 లారీలు ఓవర్ లోడ్‌తో పోలీసులకు పట్టుబడ్డాయి. మరో లారీ ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండా ఇసుకను తీసుకువెళ్తున్నదన్న సమాచారం మేరకు పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా మహదేవపూర్‌లో ఇసుకను డంప్ చేసి వెళ్లిపోయింది. ఇసుక క్వారీల కాంట్రాక్లర్లు చేస్తున్న అక్రమ దందాతో ప్రభుత్వానికి రోజుకు రూ. 16 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయానికి గండి పడుతున్నట్లు తెలుస్తున్నది.