NIT | హనుమకొండ చౌరస్తా, జులై 28: నిట్‌లో ‘హైడ్రాలజిక్ ఎక్స్ ట్రీమ్స్ విశ్లేషణ, నమూనాల అభివృద్ధిలో పురోగతులు’ అనే అంశంపై జియన్ (గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడెమిక్ నెట్ వర్క్స్) కింద 10 రోజుల ప్రఖ్యాత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని 61 మంది ప్రముఖ పరిశోధకులు, అధ్యాపకులు, నిపుణులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారని, నాగరిక నిర్మాణ శాఖ అధిపతి డాక్టర్ కీశర వెంకటరెడ్డి సమన్వక్తగా వ్యవహరించారు. ముఖ్య ఆకర్షణగా, యుఎస్ఏలోని వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయానికి చెందిన బయాలజికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరమణ శ్రీధర్ ముఖ్యఅతిథిగా విదేశీ నిపుణుడిగా హాజరయ్యారు. హైడ్రాలజిక్ మోడలింగ్, వాతావరణ భిన్నతలు, జలవనరుల నిర్వహణపై తన అంతర్జాతీయ అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ప్రారంభోత్సవ సభలో ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాసరావు (డీన్, అంతర్జాతీయ సంబంధాలు అండ్ అకడెమిక్ అఫైర్స్), నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, హాజరై, వాతావరణ మార్పుల వలన తలెత్తుతున్న జల సంబంధిత సవాళ్లను ఎదుర్కొనటంలో ఆధునిక హైడ్రాలజిక్ మోడలింగ్ అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 6 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు.