జనగామ, జూలై 5(నమస్తే తెలంగాణ) : ‘ప్రజల ప్రాణాలను చిన్నచూపు చూడటమే కాంగ్రెస్ పాలన ధోరణిగా మారిందని.. తాను అసెంబ్లీలో ఈ సమస్యను ఎన్నిసార్లు లెవనెత్తినా మార్పు లేదు.. అందాల పోటీలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప.. బ్రిడ్జి పనులకు లక్షల రూపాయలు దొరుకుతాలేవా’? అంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు.
శుక్రవారం అర్ధరాత్రి జనగామ మండలం వడ్లకొండ శివారులో నిర్మాణంలో ఉన్న గానుగుపహాడ్ కల్వర్ట్ బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కారు వాగులో పడి పలువురు గాయపడిన ఘటనపై స్పందించిన ఆయన ప్రభుత్వం నిధుల విడుదలపై చేస్తున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిలో అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు కల్వర్టు బ్రిడ్జి వద్ద ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రెండేళ్లుగా పనులు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు.
కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన రూ. 90లక్షల బిల్లు పెండింగ్లో పెట్టారని బ్రిడ్జి పకన మట్టి బ్రిడ్జి వానకాలంలో కొట్టుకపోయినా వెంటనే కలెక్టర్, ఆర్అండ్బి అధికారులకు విన్నవించడం సహా ఇదే అంశాన్ని తానే స్వయంగా అసెంబ్లీలో సమస్య లేవనెత్తితే సంబంధిత మంత్రి, అధికారులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అప్పుడే స్పందించి పనులు పూర్తిచేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని, పట్టింపులేని సర్కార్ అలసత్వం వల్లే పొరుగు రాష్ర్టానికి చెందిన భక్తులు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లు చెల్లించి పనులు పూర్తి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు.