వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు తిరిగి సాధించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలని తిరిగి పునరుద్ధరించాలని మే 20న దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. బుధవారం సీకేయం హాస్పిటల్ ఆర్ ఎం.ఓ డాక్టర్ మురళికి సమ్మె నోటీస్ అందజేసిన సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్ లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
వీటిని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు. మతోన్మాద విధానాలు విడనాడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు దామెర కృష్ణ, సీకేఎం హాస్పిటల్ అధ్యక్ష, కార్యదర్శులు కలకోట్ల రాజు, నాగవెల్లి శంకర్, శోభ, మాధవి, లక్ష్మి, వంశీ, శ్రీశైలం, స్వరూప, పద్మ, తదితరులు పాల్గొన్నారు .