వరంగల్ చౌరస్తా: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, గతంలో రద్దు చేయబడిన 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని మే 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం శివనగర్ తమ్మెర భవన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లోకి మార్చి కార్మికులకు హక్కులు లేకుండా చేసిందన్నారు.
దీనిని నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దండు లక్ష్మణ్, సహాయ కార్యదర్శులు సంఘీ ఎలేందర్, తాళ్ళపల్లి జాన్ పాల్, నల్లతీగల కుమార్, నాగవెల్లి,శంకర్, జన్ను రాజు, యాకయ్య, రాధ, మల్లికాంబ, శాంతి, కవిత, తదితరులు పాల్గొన్నారు.