శాయంపేట, ఏప్రిల్ 15 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సభ విజయవంతానికి హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మాందారిపేట నుంచి హుస్సేన్‌పల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ అసత్య ప్రచారాలు, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ మాటల్లోనే తప్ప చేతల్లో లేదని ప్రజలు తెలుసుకున్నారన్నారు.
మళ్లీ కేసీఆర్ వస్తే తప్ప తమకు మేలు జరగదన్న భావన ప్రజల్లో ఉన్నదన్నారు. పేగులు తీసి మెడలో వేసుకుంటా, తొక్కుకుంటూ పోతా, కనుగుడ్లు పీకేస్తా అంటూ రేవంత్‌రెడ్డి వీధిరౌడీలా మాట్లాడి స్థాయిని దిగజార్చుకుంటున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇలాంటి వ్యక్తా మన సీఎం అంటూ ప్రజలు, మేధావులు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్‌తోనే ఉన్నదని రేవంత్‌కు, నరేంద్రమోదీకి హెచ్చరికలా సభ ఉంటుందని చెప్పారు. వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం చెప్పేలా రజతోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవులపై ఆ పార్టీలోనే రగడ మొదలైందన్నారు. అధికారం పోగానే పార్టీ మారిన నాయకులు పోయినా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఎన్నికల్లో తమదే విజయమన్నారు. రజోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.