జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఎవుసమే తెలియని కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకెళ్లడం విడ్డూరంగా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం భూపాలపల్లి మండలం కమలాపూర్, ఆముదాలపల్లి, రాంపూర్, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, దీక్షకుంట, పంబాపూర్, నందిగామ, ఆజంనగర్, నాగారం గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గండ్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలని, 10హెచ్పీ మోటరు పెట్టుకుంటే గంటకు ఎకరం భూమి పారకం చేయొచ్చని వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంటు కోసం రైతులు 10హెచ్పీ మోటర్లను కొనుక్కోవాలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న మోటర్లతో మూడు గంటల కరెంటుకు ఎకరం కూడా పారదన్నారు.
వ్యవసాయంపై ఏ మాత్రం అవగాహన లేని రేవంత్రెడ్డి టీ పీసీసీ చీఫ్గా కొనసాగడం బాధాకరమన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం సైతం అవసరం లేదని, సమైక్య పాలనలోనే అభివృద్ధి జరిగిందని చెప్పుతూ తను సమైక్యవాది అని నిరూపించుకున్నారన్నారు. ఆరు హామీలపై జనం మండిపడుతున్నారని, కర్ణాటకలో కరెంటు కష్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే దిక్సూచి అన్నారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఏ సీఎం చేయలేని పనులను కేసీఆర్ చేసి చూపించారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన్నారు. ప్రచారంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభా రఘుపతిరావు, ఎంపీపీ మందల లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, మండల యూత్ అధ్యక్షుడు పాలకుర్తి రఘుపతిగౌడ్, నాయకులు ముద్దమల్ల భార్గవ్, భీముని శరత్, పింగిళి రవీందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.