జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ‘ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వాడవాడలా తిరుగుతూ మహిళా సంఘాలతో మాట్లాడుతూ డబ్బులు పంపిణీ చేశాడు. నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది’ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన తన కుమారుడు గండ్ర గౌతంరెడ్డితో కలిపి భూపాలపల్లిలోని 30వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఓటమి భయంతో ఓటర్లతో పాటు తమ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేశారన్నారు. ప్రజల మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థులకే ఉందని, మెజార్టీ స్థానాలు గెలువబోతున్నామని, భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నామన్నారు. 22వ వార్డు పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు పెట్టి తమను బద్నాం చేస్తున్నారని విమర్శించారు.